Breaking News

Kabul భారీగా యుద్ధ విమానాలు, సైనిక వాహనాలను నిర్వీర్యం చేసిన అమెరికా!


అఫ్గన్ భూభాగం నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తయ్యింది. నిర్దేశించుకున్న ఆగస్టు 31 గడువుకు అనుగుణంగా బలగాలను తరలించింది. ఈ నేపథ్యంలో అప్గన్ గడ్డపై పదుల సంఖ్యలో తమ యుద్ధ విమానాలు, సైనిక వాహనాలు, అత్యాధునిక రాకెట్ రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్టు అమెరికా సైనిక అధికారి తెలిపారు. సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ మాట్లాడుతూ.. 73 యుద్ధ విమానాలను కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తుక్కుగా చేసి నిరుపయోగంగా మార్చినట్టు తెలిపారు. ‘తాలిబన్ అధీనంలోకి అఫ్గన్ వెళ్లడంతో అక్కడ నుంచి రావడానికి ముందే అమెరికా సైన్యాలు వీటిని నిర్వీర్యం చేశారు.. ఆ యుద్ధ విమానాలు ఎప్పటికీ ఎగరలేవు.. వాటి ఏ ఒక్కరూ నడపలేరు.. వాటిలో చాలా వరకూ యుద్ధం మొదలుపెట్టగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.. కానీ ఖచ్చితంగా మళ్లీ ఎగరలేవు’ అని వ్యాఖ్యానించారు. కాబూల్ విమానాశ్రయంలో 6,000 మంది సైనికులు మోహరించి ఆగస్టు 14 నుంచి తరలింపు ప్రక్రియ మొదలుపెట్టామని... అక్కడ మిలియన్ డాలర్ల విలువైన 70 ఎంఆర్ఏపీ యుద్ధ వాహనాలను వదిలిపెట్టామన్నారు. అలాగే, రాకెట్, మోర్టార్, ఆయుధాల దాడులను సమర్థంగా ఎదుర్కొనే సీ-రామ్ వ్యవస్థను కూడా అక్కడే వదిలిపెట్టింది. ఈ వ్యవస్థ సాయంతోనే సోమవారం కాబూల్ విమానాశ్రయంపై ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడులను అడ్డుకున్నారు. ఆ వ్యవస్థలను చివరి నిమిషం వరకు వినియోగించామని మెకెంజీ తెలిపారు. ‘ఆ వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడం సంక్లిష్టమైన ప్రక్రియ.. చాలా సమయం తీసుకుంటుంది.. కాబట్టి వాటిని నిర్వీర్యం చేశామని తద్వారా అవి మళ్లీ ఉపయోగించలేరు’అని వివరించారు. అమెరికా రక్షణ దళాలతో కూడిన చివరి విమానం అఫ్గనిస్థాన్‌ నుంచి సోమవారం అర్ధరాత్రి బయలు దేరింది. దీంతో అఫ్గన్‌ గడ్డ నుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వైదొలగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యాలయం ప్రకటించింది. ఆది నుంచి తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ అఫ్గన్‌ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని, ఉపయుక్తంగా ఉన్నారని ఈ సందర్భంగా మెకంజీ పేర్కొన్నారు. మరోవైపు 20 ఏళ్ల అనంతరం అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.


By August 31, 2021 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-military-disabled-scores-of-aircraft-armored-vehicles-before-leaving-afghanistan/articleshow/85786878.cms

No comments