Breaking News

Farmers Protest బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. కారుపై బురద జల్లి, నల్ల రంగు పూసిన రైతులు!


గతేడాది కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలను పలు సందర్బాల్లో అడ్డుకుని, నిరసన తెలుపుతున్నారు. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యేకు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. ముజఫర్‌నగర్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్‌పై శనివారం రైతులు దాడికి యత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న రైతులు.. దానిపై బురద జల్లి నల్ల రంగు పూశారు. రాళ్ల విసరడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయూ) నేత రాకేష్ తికాయత్ స్వగ్రామం సిసౌలీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే.. తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు... వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ దాడిని అడ్డుకోలేక చేతులెత్తేశారు. ఈ గుంపు నుంచి ఆయనను రక్షించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు పోలీసుల దుస్తులపైనా నల్ల రంగు పోశారు. రాకేష్ తికాయత్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ ఆరోపించగా.. ఆయన సోదరుడు నరేష్ తికాయత్ దీన్ని ఖండించారు. ముజఫర్‌నగర్‌లోని బుధానా నియోజకవర్గం నుంచి ఉమేష్ మాలిక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేకు ఈ పరాభవం జరిగింది. ఇరుకైన సందుల్లో ఎమ్మెల్యే వాహనం ముందుకు వెళ్లలేకపోవడంతో రైతులు, స్థానికులు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. చివరకు అతికష్టంతో ఉమేష్ బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే వెళ్లినప్పుడు రైతులు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ కూడా అక్కడకు చేరుకున్నారు.


By August 15, 2021 at 12:03PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-mla-car-attacked-allegedly-by-mob-protesting-farm-laws-in-uttar-pradesh/articleshow/85344523.cms

No comments