Breaking News

భార్యతో బలవంతపు శృంగారం రేప్ కాదు.. చత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు!


భార్యతో లైంగిక చర్య లేదా బలవంతపు శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని చత్తీస్‌గఢ్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 376 కింద దాఖలైన కేసు నుంచి 37 ఏళ్ల వ్యక్తిని విముక్తి కల్పించింది. అయితే అతడిపై 377 సెక్షన్ కింద నమోదైన అసహజ నేరాలతో పాటు ఇతర అభియోగాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ‘చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య వయసు 18 ఏళ్లులోపు లేకపోతే.. బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కిందకు రాదు.. ఐపీసీ సెక్షన్ 376 రెండో మినహాయింపు స్పష్టంగా చెబుతోంది’ అని న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌కే చంద్రవన్షీ తెలిపారు. అందుకే ఆ అభియోగాల నుంచి విముక్తి కల్పించినట్లుపేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ జంటకు 2017 వివాహం కాగా.. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, బలవంతంగా శృంగారానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తాను ఒప్పుకోకపోయినా బలవంతంగా అసహజ శృంగారానికి తెగబడుతున్నాడని ఆరోపించింది. ఈ కేసులో అరెస్టయిన సదరు భర్త.. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్ విచారించిన జస్టిస్ ఎన్‌కే చంద్రవన్షీ ధర్మాసనం.. ‘ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళ చట్టబద్ధంగా అతడి భార్య.. బలవంతంగా లేదా భార్య కోరికకు విరుద్దంగా భర్త లైంగిక సంపర్కం లేదా లైంగిక చర్య అత్యాచారం నేరం కాదు.. అందువల్ల భర్తపై సెక్షన్ 376 (రేప్) కింద అభియోగాలు తప్పు.. చట్టవిరుద్ధం’ అన్నారు. ఇటువంటి కేసులోనే గతవారం కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పునకు భిన్నంగా తాజా ఆదేశాలు ఉండటం గమనార్హం. భార్యతో బలవంతపు శృంగారం అత్యాచారంగానే పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. తీర్పుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ట్విట్టర్‌లో స్పందించారు. ‘ఐపీసీ సెక్షన్‌లోని 375కు పార్లమెంట్‌లో సవరణలు చేయాల్సిన సమయం వచ్చింది.. వివాహితులైన మహిళలు తమ భర్తలతో బలవంతపు లైంగిక సంబంధాలకు ఇష్టపడరు’ అని అన్నారు. ‘భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడం అత్యాచారంగా పరిగణించలేమన్న చత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు భారత న్యాయవ్యవస్థ మేల్కొవాలి.. దీనిపై సుప్రీంకోర్టులో వీలైనంత తొందరగా అప్పీలు చేయాలి’ అని టీఎంసీ ఎంపీ మహౌ మెయిత్రా అన్నారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించని అతికొద్ది దేశాలలో భారతదేశం ఉండటం సిగ్గుచేటని శివసేన నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు.


By August 27, 2021 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/even-if-by-force-sexual-act-by-husband-not-rape-chhattisgarh-high-court/articleshow/85675925.cms

No comments