‘లా చేస్తున్నావు.. పెళ్లి చేసుకోవా?’ అని అడిగేవారు.. చీఫ్ జస్టిస్ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘సొసైటీ ఆఫ్ ఇండియన్ లా ఫర్మ్స్’ కాఫీ టేబుల్ బుక్ విడుదల కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. లా డిగ్రీ సులభంగా అందుకున్నా దాని ద్వారా జీవనోపాధి పొందడం ఒకప్పుడు చాలా సవాల్‌తో కూడుకొని ఉండేదని గుర్తుచేశారు. తాను లా చేస్తున్నప్పుడు చాలా మంది ఆ కోర్సును ఎందుకు చదువుతున్నావు? మరే ఉద్యోగమూ రాలేదా? పెళ్లి చేసుకోవాలని లేదా? అని అడిగేవారని అన్నారు. ‘ఒకప్పుడు న్యాయవాద పట్టాను సులభంగా అందుకున్నా దాని ద్వారా జీవనోపాధి పొందడం చాలా సవాల్‌తో కూడుకుని ఉండేది.. నేను లా కోర్సు చేసేటప్పుడైతే.. ఎందుకు లా చదువుతున్నావు? ఎక్కడా మరే ఉద్యోగమూ రాలేదా? పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా? అని చాలా మంది అడిగేవారు.. తొలితరం న్యాయవాదులకు కోర్టులో స్థిరమైన ప్రాక్టీస్ అనేది కలగా ఉండేది.. అందుకే దాన్ని చివరి ప్రయత్నంగా భావించేవారు.. ఇక్కడ నా వ్యక్తిగత అనుభవంతో మాట్లాడుతున్నా.. వనరుల కొరత కారణంగా మాలాంటి చాలామంది.. ప్రాక్టీస్ సమయంలోనే విషయాలు నేర్చుకున్నారు’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ‘ప్రస్తుత వాస్తవికత భిన్నంగా ఉందో? లేదో? నాకు తెలియదు.. నిజం ఏమిటంటే న్యాయవాదులకు అవకాశాలు ఇంకా అసమానంగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. భారతదేశ ఆర్ధిక సరళీకరణ చట్టపరమైన దృశ్యాన్ని గణనీయంగా మార్చేసిందని, వ్యాపారం, పెట్టుబడుల పెరుగుదలతో కార్పొరేట్ రంగంలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న న్యాయవాదులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ‘‘దేశంలో వాణిజ్య కార్యకలాపాలు వృద్ధి చెందడంతో పెట్టుబడులు పెరిగాయి.. కార్పొరేట్ రంగంలో నైపుణ్యం కలిగిన న్యాయవాదులకు డిమాండ్ పెరిగింది.. భారతీయ న్యాయసంస్థలు మరింత మందికి చేరువ కావాలి.. ఇవి కేవలం ధనవంతులకే పరిమితమనే అభిప్రాయం ఉంది... న్యాయసంస్థల కార్యకలాపాలతో సమాజానికి ఎటువంటి సంబంధం ఉండదన్న అపోహ కోర్టుల్లో ప్రాక్టీస్ చేసే లాయర్లలోనూ ఉంది.. ఈ అభిప్రాయాన్ని తొలగించుకోవాలి’’ అని అన్నారు. ‘‘న్యాయ సంస్థలు పెద్ద నగరాల్లోని యూనివర్సిటీలకు చెందినవారికే కాకుండా మిగిలిన ప్రాంతాల్లోని ప్రతిభావంతులు, మహిళా న్యాయవాదులకూ ఎక్కువ అవకాశాలను కల్పించాలి.. ’’ అని జస్టిస్ రమణ చెప్పారు. ‘నేడు భారతీయ న్యాయ సంస్థలు తమ ప్రపంచవ్యాప్త ఉన్న సహచరుల మాదిరిగానే ఉన్నాయి.. అన్ని చట్టపరమైన సమస్యలకు ఏకైక పరిష్కారంగా అనేక సంస్థలు స్థిరపడ్డాయి’ అని వ్యాఖ్యానించారు. ‘‘అంతర్జాతీయంగా న్యాయ సంస్థలు అనేక సామాజిక అంశాలను చేపడుతున్నాయి.. అవసరమైన వారికి న్యాయం అందించడంలో చురుకుగా వ్యవహరిస్తున్నాయి... మరింత ఎక్కువ సామాజికపరమైన కేసులను చేపట్టి.. ఆ సమస్యలను మా వరకూ రాకుండానే పరిష్కారమవ్వాలని నేను కోరుతున్నాను.. రాజ్యాంగం ఆకాంక్షలను నెరవేర్చడానికి మనమందరం మన వంతు కృషి చేయాలి’’ అని అభిప్రాయపడ్డారు.
By August 05, 2021 at 07:36AM
No comments