Breaking News

ఏకంగా రూ.700 కోట్ల విలువైన డ్రగ్స్.. ఇంటినే అడ్డగా మార్చేసిన స్మగ్లర్!


ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ ఇంట్లో రూ.683 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. యూపీ పోలీసులు, ఎస్ఎ‌స్‌బీ సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టి.. మహారాజ్‌గంజ్ జిల్లా తుత్తిబరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో భారీగా డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించాయి. పెద్ద ఎత్తున నిషేధిత నార్కోటిక్ ఇంజెక్షన్లు, సిరప్పులు, క్యాప్సూల్స్, టాబ్లెట్స్ సహా లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారుకాగా.. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీటీని మెడికల్ షాపుల ద్వారా నేపాల్‌కు పంపి.. భారత్- నేపాల్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో అక్రమ మార్గంలో విక్రయించనున్నారు. ఈ అంశంపై పోలీసులు సహా నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. తూత్తుబరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమౌ కాలా గ్రామంలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలున్నట్టు సమాచారం అందడంతో ఎస్ఎస్‌బీ, పోలీసులు, ఇతర అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత సరుకును చూసి పోలీసులు విస్తుపోయారు. 25,180 నార్కోటిక్ ఇంజెక్షన్లు, 100 ఎంఎల్ సామర్ధ్యం ఉన్న 18,782 సిరప్పులు, 3,13,854 క్యాప్ప్సుల్స్, 1,24,895 టాబ్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుడు వెల్లడించిన విషయాలు విని పోలీసులు షాక్ తిన్నారు. లేబుల్స్, కంపెనీ లోగోలను మార్పుచేసి నేపాల్ సరిహద్దుల్లోని మెడికల్ దుకాణాలకు ముఠాలు పంపుతాయని తెలిపారు. గత కొన్నేళ్లుగా భారత్-నేపాల్ సరిహద్దుల్లో కొన్నేళ్లుగా నిషేధిత డ్రగ్స్ వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ ముఠాల మూలాలపై భద్రతా సిబ్బంది నిఘా ఉంచాయి. నేరుగా కంపెనీల నుంచే తమకు సరఫరా అవుతాయని, వాటిని నేపాల్‌ సహా స్థానిక మెడికల్ షాపులకు పంపుతామని నిందితుడు తెలిపాడు. సరిహద్దుల్లోని యువత ఈ డ్రగ్ ఇంజెక్షన్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవింద్ గుప్తా తప్పించుకున్నాడు. అతడి ఆచూకీ గురించి చెప్పినవారికి రూ.25 వేల నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. పోలీసులకు పట్టుబడ్డ మరో నిందితుడిని రమేశ్ గుప్తా అనే వ్యక్తిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు మహారాజ్‌గంజ్ ఎస్పీ ప్రదీప్ గుప్తా తెలిపారు.


By August 05, 2021 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/drugs-worth-rs-686-crore-recovered-shocking-revelations-in-maharajganj-in-uttar-pradesh/articleshow/85057863.cms

No comments