అఫ్గన్‌లో కొనసాగుతున్న తాలిబన్ల దురాక్రమణ.. ఊహించని షాకిచ్చిన భారత్!
అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వైదొలగడంతో మొత్తం భూభాగాన్ని తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే 70 శాతానికిపైగా భూభాగంపై పట్టుసాధించారు. ఇప్పటి వరకూ 12 ప్రావిన్సులను ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడ 2002కి ముందున్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయని, మానవహక్కులకు ముప్పు వాటిళ్లుతోందని ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ వేదికలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉండగా, అఫ్గన్‌లో బలవంతంగా ఏర్పడే ప్రభుత్వాన్ని గుర్తించబోమని దోహా వేదికగా జరిగిన ప్రాంతీయ సదస్సులో భారత్, ఖతార్ సహా పలు దేశాలు స్పష్టం చేశాయి. బలవంతంగా అధికారం చేజిక్కించుకోవడం, తక్షణ సమగ్ర కాల్పుల విరమణకు పిలుపునివ్వడంలో ఎలాంటి గుర్తింపు ఉండదని తీర్మానించాయి. ఖతార్ ప్రకటన ప్రకారం.. అఫ్గన్‌లో హింసాత్మక చర్యలతో చేపట్టే అధికారాన్ని గుర్తించబోమని ఆగస్టు 10న దోహా వేదికగా జరిగిన ప్రత్యేక సమావేశంలో చైనా, పాకిస్థాన్ సహా పలు దేశాలు తీర్మానించాయని తెలిపింది. కాగా, అఫ్గనిస్థాన్- భారత్ మైత్రీ డామ్‌గా గుర్తింపు పొందిన హేరాత్‌లోని సల్మా ప్రాజెక్టును మూకలు స్వాధీనం చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టును 2016లో అఫ్గన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ప్రారంభించారు. ఇప్పటికే హేరాత్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అఫ్గన్‌లో తాలిబన్ల అకృత్యాలను అడ్డుకట్టవేసే రాజకీయ పరిష్కారం కోసం ఖతార్ కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 10న అమెరికా, చైనా, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, యూకే, ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్‌తో సమావేశం నిర్వహించింది. తర్వాత ఆగస్టు 12న భారత్, జర్మనీ, నార్వే, తజికిస్థాన్, టర్కీ, తుర్కిమెనిస్థాన్ ప్రతినిధులతో భేటీ అయ్యింది. తక్షణమే హింసను ఆపి రాజకీయ పరిష్కారం కోసం ముందుకురావాలని అఫ్గన్ ప్రభుత్వం, తాలిబన్లను ఈ రెండు సమావేశాల్లో పాల్గొన్న అన్ని దేశాలూ కోరాయని ఖతార్ తెలిపింది. ‘సైనిక చర్య ద్వారా బలవంతంగా అఫ్గన్‌లో ఏర్పడే ఏ ప్రభుత్వాన్ని గుర్తించబోమని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు స్పష్టం చేశారు’ అని ఖతార్ విదేశాంగ మంత్రి తెలిపారు. కాబూల్‌ని స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్లను గుర్తించాలని చైనా చూస్తోందనే నివేదికలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం.
By August 14, 2021 at 07:53AM
No comments