Breaking News

రెండు వారాల్లో ఆలయాలను తెరవకపోతే నిరాహార దీక్షకు దిగుతా.. అన్నా హజారే హెచ్చరిక!


కరోనా వైరస్ కారణంగా మూసివేసిన ఆలయాలన్నింటినీ రెండు వారాల్లోగా తెరవాలని ప్రముఖ సామాజిక హక్కుల నేత డిమాండ్‌ చేశారు. లేకపోతే జైల్‌ భరో చేపడతామని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. వివిధ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు సహా వైన్‌ షాపులు కూడా తెరిచే ఉంటున్నప్పుడు.. ఆలయాలను తెరవడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని అన్నా హజారే ప్రశ్నించారు. పది రోజుల్లో ఆలయాలను తెరవని పక్షంలో మందిర్‌ బచావ్‌ కృతి సమితి నిర్వహించే జైల్‌ భరోకు తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఆంక్షల విధించడంతో ఏడాదిన్నరగా ఆలయాలు, ప్రార్థనా స్థలాలన్నీ మూసే ఉంటున్నాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను దశలవారీగా సడలిస్తున్నారు. దీంతో బార్లు, వైన్‌ షాపులు, హోటళ్లు, వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు అన్నీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కోవిడ్ ఆంక్షల మధ్యే జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దీంతో ఆలయాలను కూడా తెరవాలని గత కొద్ది నెలలుగా ప్రజల నుంచి డిమాండ్‌ వస్తోంది. వివిధ సేవా సంస్థలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రార్థనా మందిరాలు తెరవడానికి అనుమతినివ్వడం లేదు. దీంతో అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన మందిర్‌ బచావ్‌ కృతి సమితి రాలేగావ్‌సిద్ధి గ్రామంలో అన్నా హాజారే కలిసి ఓ నివేదికను అందజేసింది. ఆ నివేదికను పరిశీలించిన హజారే, ఆలయాలను మూసివేసి ప్రభుత్వం ఏం సాధించిందని నిలదీశారు. మందిరాలకు వచ్చే భక్తులు కోవిడ్‌ నియమాలు కచ్చితంగా పాటిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా ఆలయాలను తెరిచేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. రెండు వారాల్లోగా ఆలయాలను తెరవకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అటు, మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీ కూడా ఆలయాలను తెరవాలని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రోజూవారీ కేసులు ఐదు వేల వరకూ నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక కోవిడ్ కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి.


By August 30, 2021 at 11:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/will-go-on-hunger-strike-if-temples-are-not-reopened-in-2-weeks-anna-hazare-warns/articleshow/85759145.cms

No comments