Breaking News

తానా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు


ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి గారి జయంతి (ఆగష్టు 29) సందర్భంగా ఆగష్టు 28, 29 రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో వర్చువల్‌గా నిర్వహించింది. ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న కార్యక్రమాలలో ఇది 16 వ సమావేశం. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తన స్వాగతోపన్యాసంలో వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి కృషి, ఆయనకు ఆ ఉద్యమంలో సహకరించిన అనేక మంది సాహితీ వేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఒక మధురమైన తెలుగు పద్యం పాడి సభలో తెలుగుదనం నింపారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ అతిథులకు, వక్తలకు ఆహ్వానం పలికారు. శనివారం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖామంత్రి, తెలుగు సంతతికి చెందిన డాక్టర్ శశి పంజా (పిల్లలమర్రి)ను సభకు పరిచయం చేసింది. శశి తండ్రి పిల్లలమర్రి వేంకట కృష్ణయ్యది తెనాలి అని, అమ్మ మాధవపెద్ది సీతాదేవిది గుంటూరు అని వివరించారు. ఆమె అన్నయ్య మోహన్ నరసరావుపేటలో పుట్టారు కానీ, చిన్నపటి నుంచి కలకత్తాలో పెరగడం, చదవడం, ఉద్యోగంతో పాటు రాజకీయాలలో కూడా రాణించడం ముదావహం అన్నారు. వృత్తి రీత్యా వైద్యురాలిగా తీరికలేకుండా ఉంటూ బెంగాల్ రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొనడం చాలా అభినందనీయం అని పేర్కొన్నారు. మంత్రి శశి పంజా మాట్లాడుతూ.. కేంద్ర మాజీ మంత్రి అజిత్ కుమార్ పంజా కుమారుడు ప్రసన్నకుమార్ పంజా‌తో వివాహం జరగడంతో తన పేరు శశి పంజాగా మారిందన్నారు. ఎందరో మహానుభావులు జన్మించిన తెలుగు నేలపై పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తాలో స్థిరపడడంతో తెలుగు నేలకు దూరమయ్యాగాని తెలుగు భాషకు కాదని తెలిపారు. తాము ఇప్పటికీ ఇంట్లో తెలుగే మాట్లాడతామని, మధురమైన మన తెలుగు భాషను మాట్లాడే వారు బెంగాల్‌లో చాలా మంది ఉన్నారన్నారు. అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని ఆమె తెలియజేశారు. తెలుగు వ్యవహారిక భాషగా ఉండాలనే ఉద్యమంలో గిడిగు వెంకట రామమూర్తి తన సర్వసాన్ని త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు నివాళులర్పించిన మంత్రి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలని ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికకు అభినందనలను తెలియజేశారు. ఈ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు విదేశాలలో ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాల సంతోషించదగ్గ విషయం అన్నారు. తనికెళ్ల భరణి రచించిన ‘ఎందరో మహానుభావులు’ అనే పుస్తకాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ప్రతిని మంత్రి డాక్టర్ శశి పంజా ఆవిష్కరించారు. తెలుగు సంతతి వ్యక్తి, బెంగాల్ డీజీపీ డాక్టర్ బొప్పూడి నాగ రమేష్ ఈ సభలో ఒక విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఎంతోమంది సంగీత విద్వాంసుల జీవిత చరిత్రలను అత్యంత మనోహరంగా భరణి చిత్రీకరించారని, అందరూ చదవాల్సిన పుస్తకం అని పుస్తక సమీక్ష చేశారు. రెండో రోజు తెలుగు తేజం, ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం ఉపకులపతి, సిడ్నీ ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ డాకర్టర్ కరణం మల్లేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు వ్యక్తిగా పుట్టడం తన అదృష్టమని, మన భాషను రక్షించుకోడానికి అందరూ పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారని అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం తెలుగు వైభవం, సాహితీవేత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి విడుదల చేశారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి నెలా సాహిత్య కార్యక్రమానికి ముందు ఈ వీడియోను ప్రదర్శిస్తామన్నారు. తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన గీతానికి, సంగీత దర్శకుడు నేమాని పార్థసారథి స్వరాలు సమకూర్చగా, అమర గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారని వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు రామమూర్తితో సహా మొత్తం 17 మంది లబ్ద ప్రతిష్టులైన విశిష్ట సాహితీవేత్తలను స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులే ఆ నాటి సామాజిక పరిస్ధితులు, జీవన విధానం సహా రచయితలతో అనుబంధం, సాహిత్య సృష్టి మొదలైన ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇది సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణమని, పాల్గొన్నవారందరికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రెండు రోజుల పూర్తి కార్యక్రమాలను యూట్యూబ్‌లో చూడవచ్చును. ఆగస్టు 28 లింక్ ఆగస్టు 29 యుట్యూబ్ లింక్:


By August 31, 2021 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/two-days-grand-celebration-of-telugu-bhasha-dinotsavam-organized-by-tana/articleshow/85786164.cms

No comments