Breaking News

రైతుల తలలు పగలడం నేను చూడాలి.. పోలీసులకు కలెక్టర్ ఆదేశం.. వీడియో వైరల్


బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు తలలు పగిలిపోవడం చూడాలని హరియాణాకు చెందిన ఓ అధికారి పోలీసులను కోరుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారి తీరుపై బీజేపీ ఎంపి వరుణ్ గాంధీతో సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధనకర్ సహా ప్రముఖ నేతలు కర్నాల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకాగా.. వారికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ రైతులు జాతీయ రహదారిని దిగ్బధించారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. రైతులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పది మంది గాయపపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కంటబడి వీడియోలో.. కర్నాల్ సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఆయుష్ సిన్హా.. కొంత మంది పోలీసులకు సూచనలు చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న రైతులెవ్వరూ ఈ ప్రాంతంలో ఉండరాదని ఆదేశించారు. ‘ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరైనా బారికేడ్లు దాటి లోపలికి రానివ్వకండి.. దీనిని ఉల్లంఘించే అవకాశం ఇవ్వొద్దు.. అలా ఎవరైనా ప్రయత్నిస్తే లాఠీలతో గట్టిగా కొట్టండి ... ఈ విషయం చాలా స్పష్టంగా చెబుతున్నా.. ఎటువంటి సూచనల అవసరం లేదు.. నేను ఇక్కడ ఒక్క నిరసనకారుడిని చూసినా అతడి తల పగిలిపోవాలి.. వారి తలలు పగులగొట్టడం నేను చూడాలనుకుంటున్నాను’ అంటూ ఎస్డీఎం సూచనలు ఇస్తున్నట్టు ఆ వీడియోలో స్పష్టంగా వినబడుతోంది. ‘మీకు ఏదైనా సందేహం ఉందా?’ అని పోలీసులను అడుగుతుండగా.. వారు ‘లేదు సార్’ అంటూ గట్టిగా సమాధానం ఇచ్చారు. కర్నాల్‌లో పోలీస్ లాఠీఛార్జ్‌ ఘటన గురించి తెలిసి పలు జిల్లాల్లో రైతులకు సంఘీభావంగా రహదారులను దిగ్బంధించారు. దీంతో ఢిల్లీ, చండీగఢ్‌ వంటి నగరాలను కలిపే జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైవేలను దిగ్బంధించిన రైతులను చెదరగొట్టడానికి కొద్ది మంది పోలీసులను మాత్రమే ఉపయోగించామని అధికారులు పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో రాళ్లు రువ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ వీడియోపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. ‘ఇది ఎడిట్ చేసిన వీడియో.. డీఎం ఇలా చెప్పుంటారని అనుకోవడం లేదు.. ఏదిఏమైనా ప్రజాస్వామ్య భారతంలోని మన పౌరులపై ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు’ అన్నారు. కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా తీవ్రంగా మండిపడ్డారు. ‘ఖట్టర్ సాబ్ హరియానీల గుండెలపై లాఠీల వర్షం కురిపించారు.. రోడ్లపై రైతుల రక్తాన్ని చింధించడం రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి’ అని హెచ్చరించారు.


By August 29, 2021 at 10:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sdm-ayush-sinha-caught-coaching-cops-about-farmers-in-haryana/articleshow/85731981.cms

No comments