Breaking News

అమానుషం.. చిన్నాారి నిర్దోషిత్వం నిరూపించడానికి గొడ్డలితో నాలుకపై వాతలు!


దొంగతానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఓ చిన్నారి పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఘటన పొరుగు దేశం పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. నిర్దోషిత్వం నిరూపించుకోవాలంటే అగ్గిలో కాల్చిన గొడ్డలిని చిన్నారి తల, నాలుకపై ఉంచారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిందని ఆరోపిస్తూ గొర్రెలకాపరి బాలిక తెహసీబ్‌ను దారుణంగా హింసించినట్టు పాక్ పత్రిక డాన్ తెలిపింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను బోర్డర్ మిలటరీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. బులూచ్‌స్థాన్‌లోని ఫాజల్ కచ్‌ తుమన్ బుజ్‌దార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత బాలిక టీ‌పాట్ లేదా కెటిల్ దొంగిలించినట్టు ఆరోపించారని ఆమె తండ్రి జాన్ ముహమ్మద్ తెలిపారు. వేడి గొడ్డలి ముఖానికి తాకడంతో ఆమె నాలుకకు గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను సిరాజ్, అబ్దుల్ రెహ్మాన్, ముహ్మద్ ఖాన్‌గా గుర్తించారు. బలూచ్‌లోని గిరిజన తెగల్లో ఇప్పటికీ అనాగరిక చర్యలు కొనసాగుతున్నాయి. నేరారోపణలు ఎదుర్కొన్నవారు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే నీళ్లలో మునిగి ఉండటం, నిప్పుల్లో నడవడం వంటివి అమలు చేస్తుంటారు. అనుమానితుడు నిర్ధిష్ట సమయం వరకు నీటిలో ఉండి సజీవంగా బయటకు వస్తే, అతడిని నిర్దోషిగా పరిగణిస్తారు. అంతకంటే ముందే బయటకు వస్తే దోషిగా నిలబడతాడు. అదేవిధంగా ఒక వ్యక్తి మంటల్లో దూకిన తర్వాత లేదా వేడి వస్తువులను తాకి తర్వాత సురక్షితంగా ఉంటే నిర్దోషిగా పరిగణిస్తారు. పాకిస్థాన్‌లో చిన్నారులపై నేరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, బాల్య వివాహాలు పాకిస్థాన్‌లో నిత్యకృత్యంగా మారాయి. పాకిస్థాన్‌లో రోజూ సగటును ఎనిమిది మంది చిన్నారులు వేధింపులకు గురవుతున్నారు.


By August 06, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/child-forced-to-lick-hot-axe-head-to-prove-innocence-in-pakistan/articleshow/85089400.cms

No comments