Breaking News

క్యాబ్ డ్రైవర్‌ను 22 సార్లు అందుకే కొట్టా.. లక్నో యువతి కేసులో మరో ట్విస్ట్


నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్‌పై యువతి దాడిచేసి, 22సార్లు చెంపదెబ్బ కొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఈ ఘటనలో వాస్తవం వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రియదర్శిని అనే యువతి రోడ్డు దాటుతుండగా.. సాదత్ అలీ సిద్ధిఖీ అనే వ్యక్తి క్యాబ్‌ నడుపుకుంటూ ఆమెకు సమీపంగా వచ్చాడు. దీంతో తనను ఢీకొట్టబోయాడని ఆరోపిస్తూ డ్రైవర్‌ను క్యాబ్‌ నుంచి లాగి మరీ అతడిని విచక్షణరహితంగా కొట్టింది. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపైనా చేయిచేసుకుంది. దీంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడి అశాంతికి భంగం కలిగించారంటూ క్యాబ్‌ డ్రైవర్‌ సిద్ధీఖీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపైనే పోలీసులు కేసు నమోదుచేయడంపై క్యాబ్ డ్రైవర్ విస్మయం వ్యక్తం చేశాడు. యువతే తనను కారులో నుంచి బయటకులాగి ఫోన్ పగలగొట్టిందని, నా జేబులోని రూ.600 లాక్కుందని వాపోయాడు. తాను ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదని, అయినా పోలీసులు నాపై కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు 24 గంటలపాటు ఆహారం పెట్టకుండా ఆ మహిళ చెప్పిందే విన్నారు, కానీ నా మాట ఎవరూ వినిపించుకోలేదని, నాకు న్యాయం కావాలని గోడు వెల్లబుచ్చుకున్నాడు. తాజాగా, ఘటనకు సంబంధించి వీడియో, సీసీటీవీ ఫుటేజీ పరిశీలించడంతో అసలు నిజం బయటపడింది. ఆ యువతే ప్రమాదకరంగా రోడ్డును దాటుతూ అక్కడ రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. హల్‌చల్‌ సృష్టించి క్యాబ్‌ డ్రైవర్‌ను కొట్టిన ఆ యువతిదే చివరికి తప్పని నిర్ధారణ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో ‘అరెస్ట్ లక్నో గర్ల్’ అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి పెరగడంతో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనిపై సదరు యువతి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. ‘పోలీసులు నా దగ్గరికీ వచ్చారు. మా కుటుంబ సభ్యులను వేధించారు. వారి వద్ద నా ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి.. నాపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవి. నేను తనని ఊరికే కొట్టలేదు.. ఆత్మరక్షణ కోసం మాత్రమే చేయి చేసుకున్నాను.. పోలీసులు తమ పనిని సక్రమంగా చేసుంటే నేను ఎందుకు కొడతాను.. ఒకవేళ నేను చనిపోయి ఉంటే.. పోస్టుమార్టం చేసి నా డెడ్‌బాడీని ఇంటికి పంపించేవారా..?’ అంటూ తన తప్పును సమర్థించుకుంది.


By August 06, 2021 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/another-twist-in-lucknow-incident-woman-who-slapped-cabbie-22-times/articleshow/85089883.cms

No comments