Breaking News

తెలిసిన వ్యక్తి బైక్ ఎక్కిన వితంతువు.. దాడికి పాల్పడి శిరోముండనం చేసిన గ్రామస్థులు


వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ.. ఓ వితంతువు పట్ల గ్రామస్థులు దారుణంగా వ్యవహరించారు. ఆమెపై దాడికి పాల్పడటమే కాదు.. శిరోముండనం చేశారు. గుజరాత్‌లోని శబర్‌కాంత జిల్లాలోని సంచేరి గ్రామంలో జులై 30న జరిగిన ఈ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త చనిపోయిన ఓ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటోంది. ఆమె గత శుక్రవారం తన ఇద్దరు కుమారుల్ని తీసుకుని సమీపంలోని హిమ్మత్‌నగర్‌ పట్టణానికి వెళ్లింది. పిల్లల ఆధార్‌ కార్డు కాపీలను అక్కడి బ్యాంకులో ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యింది. తనకు తెలిసిన ఓ వ్యక్తి లిఫ్ట్ ఇవ్వడంతో అతడి బైక్‌పై వస్తుండగా.. మార్గమధ్యలో నలుగురు గ్రామస్థులు ఆటకాయించారు. వారిద్దరికీ వివాహేతర సంబంధం ఉందంటూ తీవ్రంగా కొట్టి తర్వాత గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడ వీరితో పాటు మరో ఇద్దరు మహిళలు కలిసి దాడికి పాల్పడ్డారు. మహిళ దుస్తులను చింపి శిరోముండనం చేసి.. మరోసారి ఇద్దరూ కలిసి కనిపిస్తే చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో గాంభోయ్ పోలీసులు సంచేరి గ్రామానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి.. నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలను ఆగస్టు 1న అరెస్టు చేశారు. వీరిపై 147, 354, 506-2 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బాధితురాలికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి.. నిందితుల్లో ఒకరి సోదరికి భర్తగా గుర్తించారు. గాంభోయ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పీపీ జనీ మాట్లాడుతూ.. బాధితురాలి ఫిర్యాదుతో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ‘వదన్‌సిన్హ్ చౌహన్, రాజుజి చౌహన్, కలుసిన్హ్ చౌహన్, రాకేశ్‌సిన్హ్ చౌహన్, సురేఖ చౌహన్, సోనాల్ చౌహన్‌ను అరెస్ట్ చేశాం.. ఉద్దేశపూర్వకంగానే నిస్సాహుయురాలపై ఆమె మహిళపై దాడిచేశారు.. తమ బంధువు బైక్‌పై రావడంతో అతడితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ దారుణంగా వ్యవహరించారు’ అని తెలిపారు.


By August 03, 2021 at 10:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/six-arrested-for-assaulting-widow-man-over-affair-in-gujarat/articleshow/84995817.cms

No comments