Breaking News

గంటకు 94 వేల కి.మీ. వేగంతో భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. నేడు సమీపంగా!


భూమికి చేరువగా గ్రహశకలం దూసుకొస్తున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. గంటకు 94వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ గ్రహశకలం ప్రమాదకరమైనదిగా హెచ్చరించింది. ఈ గ్రహశకలం శనివారం భూమికి అత్యంత సమీపంగా వచ్చి వెళుతుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి దీనివల్ల ఎలాంటి హాని ఉండబోదని తెలిపింది. ఆ గ్రహశకలానికి ‘2016 ఏజే193’ అని పేరును సూచించారు. 4,500 అడుగులు వెడల్పుండే ఈ శిల ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలిఫా విస్తీర్ణం కంటే పెద్దది. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇది శనివారం భూమికి దగ్గరగా వచ్చి వెళుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో ఆస్ట్రాయిడ్‌, భూమికి మధ్య ఉన్న దూరం.. పుడమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువని అంచనా వేస్తున్నారు. ఇది మళ్లీ 2063లో భూమికి దగ్గరగా వస్తుందని పేర్కొన్నారు. 2016 జనవరిలో హవాయ్‌లోని పాన్‌స్టార్స్‌ అబ్బర్వేటరీ సాయంతో ఈ గ్రహ శకలాన్ని తొలిసారిగా గుర్తించారు. ఆ తర్వాత నాసా.. నియోవైస్‌ అనే వ్యోమనౌక సాయంతో దీన్ని నిశితంగా పరిశీలించింది. ఈ ఖగోళ వస్తువు చాలా చీకటిగా ఉందని, దీని నుంచి ఎక్కువ కాంతి పరావర్తనం చెందటంలేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఇది 5.9 ఏళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తుందని తెలిపారు. ఈ గ్రహశకలం 1.4 కిలోమీటర్ల వెడల్పున్నా గంటలకు 94,208 కిలోమీటర్ల భారీ వేగంతో దూసుకొస్తుందని అన్నారు. అయితే, దీని వల్ల మానవజాతికి ఎటువంటి ముప్పు ఉండబోదని నాసా శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. కాగా, ఇంతకు ముందు అంచనా వేసిన దానికంటే ‘బెన్ను’ అనే గ్రహశకలం వల్ల ముప్పు ఎక్కువేనని నాసా పేర్కొంది. ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశాలు 2,700 నుంచి 1,750కి పెరిగాయి. సౌరవ్యవస్థలోనే అత్యంత ప్రమాదకరమైన గ్రహశకలంగా బెన్నూను పరిగణిస్తున్నారు. రాబోయే రెండు వందల ఏళ్లలో ఇది భూమిని తాకుతుందని అంచనా వేస్తున్నారు. ఓసిరిస్-రెక్స్ స్పేస్‌క్రాఫ్ట్ సాయంతో రాబోయే శతాబ్దాల్లో ఇది ఖచ్చితంగా ఎక్కడ కూలుతుంది తదితర అంశాలను మరింత లోతుగా అవగాహన చేసుకోడానికి నాసా ప్రయత్నిస్తోంది. ఇది ప్రతి ఆరేళ్లకు ఒకసారి భూమికి సమీపంగా వస్తుందని గుర్తించారు.


By August 21, 2021 at 11:19AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/asteroid-speeding-at-94000-kmph-to-pass-by-earth-today-says-nasa/articleshow/85508519.cms

No comments