Breaking News

అమెరికా సైనికుల గొప్ప మనసు.. అఫ్గన్ చిన్నారులను అక్కున చేర్చుకుని సపర్యలు!


తాలిబన్ల ఆక్రమణలతో అఫ్గనిస్థాన్‌లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దశాబ్దాల కిందట ముష్కర మూకల అరాచక పాలన పీడకలలా వెంటాడటంతో అఫ్గాన్‌ వాసులు ఎలాగైనా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. రాజధాని నగరంలో కాబూల్‌‌లోని విమానాశ్రయానికి పోటెత్తుతున్న ప్రజలను తాలిబన్లు వారిని అడ్డుకుంటున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు.. కనీసం తమ పిల్లల్నైనా తాలిబన్ల నుంచి కాపాడుకోవాలని ఆరాపడుతున్నారు. ఈ క్రమంలో కాబుల్ విమానాశ్రయంలో ఓ చిన్నారిని ఇనుప కంచెపై నుంచి తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే లోపలికి అనుమతించకపోవడంతో గేటు వద్ద నిరీక్షించారు. ఆ సమయంలో చిన్నారి అనారోగ్యానికి గురవడంతో దిక్కుతోచని స్థితిలో అమెరికా దళాల సాయం కోరారు. దీనికి వెంటనే స్పందించిన యూఎస్‌ భద్రతా సిబ్బంది ఆ చిన్నారిని ఇనుప కంచెపై నుంచి తీసుకుని ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి చికిత్స అందించిన అనంతరం తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కల్లోల పరిస్థితుల్లోనూ ఆ భద్రతాసిబ్బంది మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ శిశువుకు సాయం చేసిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. గుర్తుతెలియని ఓ చిన్నారి అస్వస్థతకు గురికావడంతో తమ సాయం కోరినట్టు సైనికులు చెప్పారన్నారు. ‘మానవతాదృక్పథంతో చిన్నారిని గోడపై నుంచి తీసుకుని.. విమానాశ్రయంలోని నార్వే ఆస్పత్రికి తీసుకెళ్లారు.. చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు’ అని అన్నారు. ఆ కుటుంబం ఎవరు? వారి స్థాయి ఏంటి? అఫ్గన్లకు ప్రత్యేక కార్యక్రమం కింద అమెరికా వీసాకు ఆమోదం వచ్చిందా? అనేది తెలియదని కిర్బీ అన్నారు. ప్రస్తుతం వద్ద దాదాపు 6000 మంది అమెరికా సైనికులు కాపాలా కాస్తున్నారు. కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు చాలా దర్శనమిస్తున్నాయి. ఓ సైనికుడు తన చేతుల్లోకి ఓ పసికందును తీసుకుని తండ్రి లాలిస్తూ.. ఆ బోసినవ్వులు చూసి మురిసిపోతున్నాడు. కాబూల్ విమానాశ్రయంలో అఫ్గన్‌ వాసుల పిల్లలను సైనికులు ఎత్తుకుని ఆడిస్తున్న చిత్రాలు, వారికి సాయం చేస్తున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.


By August 21, 2021 at 12:05PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-soliders-aiding-babies-at-kabul-airport-capture-videos-and-photos-viral/articleshow/85509308.cms

No comments