Breaking News

వీడు మామూలోడు కాదు.. ప్లాస్టిక్ కవర్‌లో గాలిపట్టి రూ.5.6 లక్షలకు అమ్మేశాడు!


చాలా మందికి మాటలు అమ్మడం ఒక నేర్పు.. కానీ, విచిత్రంగా ఓ వ్యక్తి గాలిని వేలంలో అమ్మి లక్షలు సంపాదించాడు. ప్లాస్టిక్ కవర్‌లో గాలిని నింపి దానిని వేలంలో పెడితే ఏకంగా రూ. 5.6 లక్షలకు అమ్ముడయ్యింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన అమెరికాలోని అట్లాంటాలో జరిగింది. ఈ వేలం గురించి తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత పాప్ సింగర్ కన్యె వెస్ట్ ఇటీవల రూపొందించిన ‘డొండా’ అనే ఆల్బమ్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నాడు. తన తల్లి పేరుతో ఆల్బమ్‌ను విడుదల చేస్తుండటంతో దీనికి ముందు జులై 22న అట్లాంటాలోని మెర్సిడెస్ బెంజ్ స్టేడియంలో కన్యె వెస్ట్ ఓ కన్సర్ట్ ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తికి అద్భుతమైన ఆలోచన రావడంతో వెంటనే దానిని అమలు చేసేశాడు. ఓ చిన్న ప్లాస్టిక్ కవర్‌ను పట్టుకుని అందులో అక్కడి గాలిని నింపాడు. ఆ తర్వాత ఆ కవర్‌ను ఈ-బేలో వేలం పెట్టాడు. ఈ కవర్‌లో ఉన్నది అలాంటి, ఇలాంటి గాలి కాదని, కన్యెవెస్ట్ నిర్వహించిన డొండా డ్రాప్ కన్సర్ట్‌లో పట్టిన గాలి అని చెప్పడంతో దానిని సొంతం చేసేందుకు జనాలు ఎగబడ్డారు. గాలి నింపిన ప్లాస్టిక్ బ్యాగ్ ప్రారంభ ధరను 3,300 డాలర్లు (రూ.2.47 లక్షలు)గా నిర్ణయించాడు. చివరికి ఓ వ్యక్తి వేలంలో 7,600 డాలర్లకు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 5.64 లక్షలు కొనుగోలు చేసి సొంతం చేసుకున్నాడు. ఈ వేలం గురించి మరొక ఆశక్తికర అంశం ఏంటంటే.. బ్యాగ్ కొనుగోలు చేసే వ్యక్తి షిప్పింగ్ ఛార్జీలు కింద అదనంగా నాలుగు డాలర్లు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, 2015లోనూ ఓ వ్యక్తి ఇలాగే గాలి నింపిన ప్లాస్టిక్ బ్యాగ్‌ను 60,000 డాలర్లకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు.


By August 07, 2021 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/bag-of-air-sold-for-over-rs-5-lakh-in-usa-links-it-to-singer-kanye-west/articleshow/85120165.cms

No comments