Breaking News

ఆగస్టు 31లోగా వెళ్లాల్సిందే.. లేకపోతే తీవ్ర పర్యవసానాలు.. అమెరికాకు తాలిబన్ వార్నింగ్!


ఆగస్టు 15న రాజధాని కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో మొత్తం తాలిబన్ల పాదాక్రాంతమయ్యింది. దీంతో గతంలో తాలిబన్ల అరాచక పాలన అనుభవాలు కళ్లముందు సాక్షాత్కరించడంతో అఫ్గన్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారి చేతుల్లో చిత్రహింసలు పడేకంటే పరాయి దేశంలో ఉండటమే ఉత్తమమని వేలాది మంది మాతృదేశం వీడుతున్నారు. మరోవైపు, అఫ్గన్ నుంచి అమెరికా సైన్యాల ఉపసంహరణకు గడువు ఆగస్టు 31 దగ్గరపడుతోంది. పొడిగింపు అంశంపై సైన్యంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆదివారం ప్రకటించారు. ఈ ప్రకటనపై స్పందించిన తాలిబన్లు.. అమెరికాకు హెచ్చరికలు చేశారు. అఫ్గన్ గడ్డపై నుంచి అమెరికన్‌ సేనల ఉపసంహరణకు ఆగస్టు 31 రెడ్‌లైన్‌.. డెడ్‌లైన్‌ అని తేల్చిచెప్పారు. ఆ సమయం దాటిన తర్వాత అమెరికా, నాటో దళాలు తమ గడ్డపై ఉంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాలిబన్ల వశమైన అఫ్గనిస్థాన్‌లో ప్రస్తుతం కాబూల్‌ విమానాశ్రయం మాత్రమే విదేశీ సైన్యాల ఆధీనంలో ఉంది. అమెరికా సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు అక్కడ నుంచే పనిచేస్తున్నాయి. తమ పౌరులతోపాటు దేశం విడిచి వెళుతున్న అఫ్గన్ ప్రజలను కూడా వారే విదేశాలకు తరలిస్తున్నారు. అయితే, అగ్రరాజ్యం ఊహించిన దానికన్నా మెరుపు వేగంతో అఫ్గన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడ చిక్కుకున్న విదేశీయుల తరలింపు క్లిష్టంగా మారింది. కాబూల్‌ నగరంలో తాలిబన్లు అడుగడుగునా చెక్‌పాయింట్లు పెట్టి ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారిని అడ్డుకోవడంతో తరలింపు నెమ్మదిగా సాగుతోంది. దీంతో సేనలు ఉపసంహరణ గడువును పెంచాలని అమెరికాను బ్రిటన్‌ సహా పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గడువు పెంపు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్టు బైడెన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు తాజా హెచ్చరిక జారీ చేశారు. అఫ్గన్ శాంతి ఒప్పందం ప్రకారం.. సెప్టెంబరు 1 నాటికి అమెరికా సైన్యాల ఉపసంహరణ పూర్తవుతుంది. అలాగే, బైడెన్ యంత్రాంగంతో ఒప్పందం మేరకు ఆగస్టు 31 వరకు తాలిబన్ల నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగదు. ఇదే సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విజ్ఞ‌ప్తితో జీ దేశాల అత్యవసర సమావేశం మంగళవారం ఏర్పాటుచేశారు.


By August 24, 2021 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-taliban-warn-us-of-consequences-if-august-31-deadline-extended/articleshow/85585524.cms

No comments