Breaking News

Doritos Chip: ఒక్క ఆలూ చిప్‌కు రూ.14 లక్షలు... బాలికపై కనకవర్షం కురిపించిన కంపెనీ


అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఊహించడం చాలా కష్టం. కొందరు ఎంత కష్టపడినా తగిన ఫలితం రాక నిరాశ పడుతుంటారు.. కానీ కొందరికి మాత్రం సరదాగా చేసే పనులు రూ.లక్షలు తెచ్చిపెడతాయి. ఇలాంటి అదృష్టమే ఆస్ట్రేలియాకు చెందిన ఓ బాలికను వరించింది. తాను తినే చిప్స్‌లో ఒకటి కాస్త వింతగా ఉండటంతో దాన్ని దాచుకుంది. ఆ తర్వాత దాన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో పెట్టడంతో చాలామంది వేలం వేయమని సలహా ఇచ్చారు. దీంతో ఆ బాలిక దాన్ని ఆన్‌లైన్లో వేలం వేయగా ఏకంగా రూ.14లక్షల ధర పలికింది. Also Read: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌ నగరానికి చెందిన రైలీ స్టువార్ట్‌ అనే 13 ఏళ్ల బాలికకు బంగాళాదుంప చిప్స్ అంటే చాలా ఇష్టం. ఆ దేశంలో ప్రముఖ బ్రాండ్ అయిన డోరిటోస్ ఆలూ చిప్స్ అంటే లొట్టలేసుకుంటూ తినేస్తుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం రైలీ డోరిటోస్ ఓ చిప్స్ ప్యాకెట్ కొనుక్కుని తింటోంది. దానిలో ఆమెకు ఓ చిప్ ముక్క వింతగా అనిపించింది. అది మిగతా చిప్స్ ముక్కల్లా కాకుండా సమోసాలాగా ఉబ్బినట్లు ఉంది. వింతగా అనిపించడంతో ఆ బాలిక దాన్ని తినకుండా భద్రంగా దాచుకుంది. తర్వాత దాన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసింది. సమోసాలా భిన్నంగా ఉన్న ఈ ఆలూ చిప్‌ వీడియో తెగ వైరలయ్యింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో రైలీ తెగ ఖుషీ అయిపోయింది. సమోసాలాగ ఉన్న ఆ చిప్‌ని వేలం వేస్తే తాము కొనుక్కుంటామని చాలామంది నెటిజన్లు రైలీకి మెసేజ్‌లు పెట్టారు. దీంతో రిలే ఆ చిప్ ముక్కను ఈబే సైట్‌లో లిస్ట్‌ చేసి ధర ఒక్క డాలర్‌ కంటే తక్కువ కోట్‌ చేసింది. అయితే ఆశ్చర్యంగా గంటల వ్యవధిలోనే దాని విలువ 2 వేల డాలర్లకు చేరింది. ఆలూ చిప్స్ కోసం ఆన్‌లైన్ వేలం జరుగుతున్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయిన డోరిటోస్ కంపెనీ తాను కూడా బిడ్డింగ్‌లోకి దిగింది. అందరి కంటే ఎక్కువగా 20,100 డాలర్లు(14,90,251 రూపాయలు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ మొత్తం చూసి రిలే కుటంబ సభ్యులు షాకైపోయారు. ఏదో సరదాకు చేసిన పనికి రూ.లక్షలు వచ్చిపడతాయని అస్సలు ఊహించలేదని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. అయితే ఆ బాలిక ఏదో సరదా వేలం నిర్వహిస్తే డోరిటోస్ కంపెనీ అత్యుత్సాహానికి పోయి రూ.లక్షలు పోగొట్టుకుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై స్పందించిన కంపెనీ.. ‘మరొకరైతే ఆ చిప్ ముక్కను తినేసేవారేమో.. కానీ ఆ బాలిక క్రియేటివ్‌గా ఆలోచించింది. దాన్ని వ్యాపార కోణంలో చూసి బిజినెస్ క్రియేట్ చేసింది. ఆమెలోని ధైర్యం గల వ్యాపారవేత్తను గమనించే వేలంలో పాల్గొన్నాం. ఆమెతో కుటుంబం మొత్తం మా ఆలూ చిప్స్‌కు అభిమానులం. పైగా ఈ వేలం వల్ల మా కంపెనీకి విపరీతమైన పబ్లిసిటీ కూడా వచ్చింది’ అని పేర్కొంది.


By August 24, 2021 at 11:38AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/doritos-snack-company-pays-rs-14-lakh-to-13-year-old-australia-girl-discovering-rare-chip/articleshow/85585744.cms

No comments