Breaking News

Karnataka CM పదవి పోయినా పంతం నెగ్గించుకున్న యడ్డీ.. వ్యతిరేకులకు మరో షాక్!


కర్ణాటకలో కొద్ది రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలకు బీజేపీ అధిష్ఠానం తెరదించింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మర్నాడే కొత్త సీఎం ఎంపిక ప్రక్రియను ముగించింది. యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడం.. మంగళవారం కొత్త నేతను ఎంపిక చేయగా.. బుధవారం ప్రమాణ స్వీకార చేయనున్నారు. ముందుగానే రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం కొత్త నేత ఎంపిక ప్రశాంతంగానే ముగిసింది. యడియూరప్ప సన్నిహితుడు బసవరాజ బొమ్మైను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. దీంతో పదవి నుంచి దిగిపోయినా యడ్డీ తన పంతం నెగ్గించుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికే సీఎం పగ్గాలు అప్పగించారు. ఇదే సమయంలో యడియూరప్పను తొలగించామన్న సంతృప్తి ఆయన వ్యతిరేకులకు ఎంతో సేపు నిలువలేదు. ఎందుకంటే అధిష్ఠానం నుంచి యడియూరప్పకు మద్దతు లభించడమే అందుకు కారణం. కేవలం వయసుకు సంబంధించిన నిబంధనల కారణంగానే తప్పించాం తప్ఫ.. ఆయన నాయకత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని బసవరాజ ఎంపికతో అధిష్ఠానం స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన ప్రతి వ్యవహారం యడియూరప్ప పర్యవేక్షణలో ఉండబోతుందని అరుణ్‌సింగ్‌ ప్రకటించడంతో వ్యతిరేకులకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది. యడ్డీకి వ్యతిరేకంగా ఎందరో ఢిల్లీలో ఫిర్యాదులు చేసినా.. వాటిని పట్టించుకోకుండా సన్నిహితుడికే నాయకత్వ బాధ్యత అప్పగించటం గమనార్హం. యడియూరప్పకు మానసపుత్రుడిగా చెప్పుకునే బసవరాజ కొత్త నేతగా ఎంపిక కావటం అప్ప విజయంగానే భావిస్తున్నారు. ఓ విధంగా ఆయనకు నీడలాగే బసవరాజ మలుసుకుంటారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప జులై 10నే రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే రోజున ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన తన రాజీనామా లేఖను పంపారని యడ్డీకి సన్నిహితుడైన ఓ సీనియర్ నేత పేర్కొన్నారు. ఇది జరిగిన ఆరు రోజుల అనంతరం కుమారులతో కలిసి ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారని తెలిపారు. ఆరోగ్య కారణాలతో తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారని అన్నారు. పైకి మాత్రం తాను రాజీనామా చేయడం లేదని చెప్పినా.. అంతకు ముందే నిర్ణయించుకున్నారని వివరించారు.


By July 28, 2021 at 06:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/senior-leader-basavaraj-bommai-as-chief-minister-bs-yediyruappa-approves/articleshow/84812262.cms

No comments