ఎన్నికల అనంతరం హింస.. మమతాకు షాకిచ్చిన కలకత్తా హైకోర్టు!
బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనల విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితాల అనంతరం పెద్దఎత్తున హింసాకాండ, మహిళలపై అత్యాచారాలు జరిగినా అటువంటివి ఏమీ లేవని ప్రభుత్వం చెప్పడంపై మండిపడింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నివేదికను పరిశీలించామని.. దౌర్జన్యాలు, అకృత్యాలకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం స్పష్టంచేసింది. ‘చాలా మంది హత్యకు గురయ్యారు. మహిళలు లైంగిక హింసకు గురయ్యారు. మైనర్ బాలికలపైనా క్రూరంగా అత్యాచారాలు జరిగాయి. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేశారు. ఇది భరించలేక చాలా మంది ఇళ్లు వదిలి పారిపోయారు. తిరిగి ఇళ్లకు చేరేందుకు బాధితుల్లో విశ్వాసం కల్పించడంలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటువంటి ఏమీ జరగలేదని తొలి నుంచీ ప్రభుత్వం ఖండిస్తోంది. బాధితుల ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదు సరికదా వారిపైనే ఎదురుకేసులు పెట్టారు’ అని అసహనం వ్యక్తం చేసింది. హింసాత్మక ఘటనలకు సంబంధించి బాధితుల అన్ని ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. భవిష్యత్‌లో న్యాయపరమైన విచారణ కోసం హింసాకాండకు సంబంధించిన ఆదారాలను సేకరించి భద్రపరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ద్వివేదిని నిర్దేశించింది. ఎన్నికల అనంతర హింసాకాండలో పెద్దఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వేల కొద్దీ ఫిర్యాదులందాయి. ఒక్క పశ్చిమ బెంగాల్ న్యాయసేవల అథారిటీయే 3,423 ఫిర్యాదులను కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఫిర్యాదులన్నిటిపైనా దర్యాప్తు జరిపేందుకు హైకోర్టు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులను రీకాల్ చేయాలని, సవరించాలని, విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనం జూన్ 21నే తోసిపుచ్చింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదికను తాజాగా పరిశీలించిన ధర్మాసనం.. పై ఆదేశాలిచ్చింది. బాధితులకు వైద్య చికిత్స, నిత్యావసరాలను ప్రభుత్వం అందజేయాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ బాధితులకు రేషన్ కార్డు లేకున్నా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలో చనిపోయిన బీజేపీ కార్యకర్త అభిజీత్ సర్కార్ మృతదేహానికి కోల్‌కతా కమాండ్ ఆస్పత్రిలో రెండోసారి శవపరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఘటనపై ఎందుకు కేసు నమోదుచేయలేదో సమాధానం చెప్పాలని జాదవ్‌పూర్ కలెక్టర్, ఎస్పీలకు షోకాజ్ నోటీసు జారీచేసింది.
By July 03, 2021 at 07:57AM
No comments