Breaking News

కశ్మీర్‌లో సైన్యానికి భారీ విజయం.. ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతం


జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. హంజిన్ రాజ్‌పొర వద్ద గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందాడు. లష్కరే తొయిబా డిస్ట్రిక్ట్ కమాండర్, ఓ విదేశీ ఉగ్రవాది సహా ఐదుగురు ముష్కరులు హతమైనట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఉగ్రవాది నిషాజ్ లోనే అలియాస్ ఖైతాబ్ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని తెలిపారు. విదేశీ ఉగ్రవాదిని పాకిస్థాన్ జాతీయుడిగా భావిస్తున్నామని, అతడి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్.. శ్రీనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు ఐజీ పేర్కొన్నారు. ఇది కశ్మీర్‌లో భద్రతా బలగాలకు భారీ విజయమని అన్నారు. హంజిన్ రాజ్‌పొర వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారంతో గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని ఆయన తెలిపారు. గురువారం రాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా బలగాలు.. నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించినట్టు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ అమరుడైనట్టు అధికారులు వెల్లడించారు. రెండు రోజుల కిందటే లష్కరే తొయిబాకు చెందిన కమాండర్ నదీమ్ అబ్రార్ సహా మరో ఉగ్రవాదిని శ్రీనగర్ శివారులోని పరింపొర వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే.


By July 03, 2021 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-five-lashkar-terrorists-and-jawan-killed-in-encounter-in-pulwama/articleshow/84084495.cms

No comments