Breaking News

గతంలో తండ్రి మాధవరావు నిర్వహించిన శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్యకు!


ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర క్యాబినెట్‌ను భారీగానే ప్రక్షాళన చేశారు. ఎన్‌డీఏ-2 అధికారం చేపట్టిన సమయంలో నియమితులైన 53 మంది మంత్రుల్లో 12 మందికి ఉద్వాసన పలికారు. వీరిలో మరో ఏడుగురికి క్యాబినెట్ హోదా కల్పించి.. కొత్తగా 36 మందిని తీసుకున్నారు. దీంతో మొత్తం మోదీ క్యాబినెట్ సభ్యుల సంఖ్య 77కి చేరింది. వరుసగా రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2019 మే 31న 57 మంది మంత్రులతో క్యాబినెట్‌ ఏర్పాటు చేశారు. రాజీనామాలు, మరణాల కారణంగా ఆ సంఖ్య 53కి తగ్గిపోయింది. గతేడాది మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రివర్గంలో చోటు కల్పించగా.. ఆయనకు క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. జ్యోతిరాదిత్యకు పౌర విమానయాన శాఖ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకూ ఈ శాఖ బాధ్యతలు నిర్వహించిన హరదీప్ సింగ్ పూరీకి... గ్రామీణాభివృద్ధి, పెట్రోలియం శాఖకు బదిలీ చేశారు. కేంద్ర మంత్రిగా తన అవకాశం కల్పించినందుకు బీజేపీ పెద్దలకు జ్యోతిరాదిత్య కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వ్యాఖ్యానించారు. అయితే, గతంలో తండ్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా తండ్రి నిర్వహించిన శాఖ బాధ్యతలను కుమారుడికి అప్పగించడం విశేషం. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సంస్థానం వారసుడైన జ్యోతిరాదిత్య సింధియా.. 1971లో జన్మించారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నారు. అనూహ్యంగా విమాన ప్రమాదంలో తండ్రి మాధవరావు సింధియా హఠాన్మరణం చెందడంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2002లో గుణ లోకసభ నియోజకవర్గం ఉప-ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. సెప్టెంబరు 2001లో మాధవరావు సింధియా, మరో ఏడుగురు ప్రయాణిస్తున్న బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ సీ90 విమానం ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌‌పురి జిల్లాలో కూలిపోవడంతో వీరంతా మృతిచెందారు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా.. యూపీయే హాయాంలోనూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. గతేడాది మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంలో జ్యోతిరాదిత్య ప్రధాన పాత్ర పోషించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి, తన వర్గం ఎమ్మెల్యేతో తిరుగుబాటు చేశారు. దీంతో కమల్‌నాథ్ నాయకత్వంలోని ప్రభుత్వం కూలిపోయి.. మళ్లీ బీజేపీ అధికారం చేపట్టింది.


By July 08, 2021 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jyotiraditya-scindia-gets-civil-aviation-once-headed-by-his-father-madhavrao-scindia/articleshow/84223216.cms

No comments