Breaking News

పంజాబ్ ముగిసింది.. ఇక రాజస్థాన్‌పై దృష్టి.. అసమ్మతి చల్లార్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్


వివిధ రాష్ట్రాల్లో నెలకున్న అంతర్గత విభేదాల పరిష్కారంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఇటీవలే పంజాబ్‌లో అసమ్మతికి ముగింపు పలికిన అధిష్ఠానం.. తాజాగా రాజస్థాన్‌లోనూ పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించారు. గతేడాది తిరుగుబాటు చేసిన సచిన్‌ పైలట్‌ వర్గాన్ని సంతృప్తి పరిచే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే అధిష్ఠానం తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌, రాజస్థాన్ ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ శనివారం జైపుర్‌ చేరుకున్నారు. సీఎం అశోక్‌ గహ్లోత్‌ నివాసానికి నేరుగా వెళ్లిన వారు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు మొగ్గుచూపుతున్నట్లు భోగట్టా. ఈ మేరకు ఓ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ వారంలోనే క్యాబినెట్‌ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల యూపీకి చెందిన కీలక నేత జితిన్‌ ప్రసాద్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సచిన్‌ను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు లేకపోతే కాంగ్రెస్‌ మరో యువనేతను కూడా కోల్పోవాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. అదే సమయంలో పైలట్‌ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో.. అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికే వెళ్లారంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే, వాటని తోసిపుచ్చిన సచిన్... అధిష్ఠానంతో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. తన డిమాండ్లపై పార్టీ త్వరలో సరైన నిర్ణయం తీసుకోనుందని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న సమావేశం కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ కాదని రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సారా స్పష్టం చేశారు. గతేడాది ఆగస్టులో సచిన్ తన వర్గం ఎమ్మెల్యేలు 18 మందితో క్యాంప్ రాజకీయాలను నడిపారు. బాహటంగానే ముఖ్యమంత్రి వ్యవహారశైలిని వ్యతిరేకించిన ఆయనను అధిష్ఠానం బుజ్జగించింది. స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రంగంలోకి దిగి సచిన్‌తో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించి, ఆయన వర్గానికి సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడ్డ సచిన్.. అలకవీడారు.


By July 25, 2021 at 12:27PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/after-punjab-congress-high-command-to-resolve-rajasthan-infighting/articleshow/84725544.cms

No comments