తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ.. గూగుల్‌ను ఆశ్రయించిన బన్నీ వాస్
సినిమా ప్రముఖులకు కొందరు వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం సాధారణం. మిమ్మల్ని చంపేస్తామని.. వేరే విధంగా బెదిరింపులు వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్లు వెంటనే పోలీసులను ఆశ్రయిస్తుంటారు. సోషల్‌మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ బెదిరింపులు బాగా పెరిగిపోయాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్లు సెలబ్రిటీలను బెదిరించడం ప్రారంభించారు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాస్‌కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆయన్ని కుటుంబంతో సహా అందరినీ చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సోషల్‌మీడియాలో తనకి బెదిరింపులు వస్తున్నాయంటూ.. ఆయన స్వయంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు లేఖ రాశారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై ఆ లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను చంపేస్తానని చెబుతూ ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పెట్టాడని బన్నీ వాసు చెప్పారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లోంచి తొలగించేలా చేయడానికి తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. గతంలోనే చాలాసార్లు ఇలాంటి ఫిర్యాదులు చేసిన తనకి సమాధానం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరో ఒకరు పెట్టిన సమాచారం అబద్ధమని నిరూపించడం చాలా కష్టమని ఆయన చెప్పారు. ఇటువంటివి ఆన్‌లైన్‌లో రాకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే వార్తల్లో నిలవడం ఇది మొదటిసారి కాదు.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేశాడంటూ చాలా కాలంగా ఓ మహిళ ఆరోపణలు చేసింది.
By July 25, 2021 at 01:47PM
No comments