Breaking News

సహకార సంఘాలపై తీర్పు.. రాష్ట్ర అంశాల్లో కేంద్ర ఏకపక్ష చట్టాలు చెల్లవని సుప్రీం వ్యాఖ్యలు


రాష్ట్రాల పరిధిలో ఉండే సహకార సంఘాల విధి విధానాలు, నిర్వహణ విషయంలో కేంద్రం ఏకపక్షంగా చేసే చట్టాలు చెల్లవని సంచలన తీర్పును వెలువరించింది. సహకార సంఘాల నిర్వహణపై నాటి యూపీయే నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 97వ రాజ్యాంగ సవరణ తీరును త్రిసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. అయితే, బహుళ రాష్ట్రాల్లో కార్యకలాపాలుండే సహకార సంఘాల కోసం ఆర్టికల్ 243Z Rలో చేర్చిన పార్ట్‌ 9B నిబంధనలు మాత్రం కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశమై కేంద్రం తీసుకొచ్చిన 97వ రాజ్యాంగ సవరణను జస్టిస్‌ ఆర్‌ ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం 2:1 మెజార్టీతో సమర్థించింది. ఇదే అంశంపై గుజరాత్‌ హైకోర్టు 2013లో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ‘‘వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు మాత్రమే రాజ్యాంగంలోని 243Z Rలో చేర్చిన పార్ట్‌ 9B నిబంధనలు వర్తిస్తాయి. ఇతర సహకార సంఘాలకు ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి ఉండవు’’ అని ధర్మాసనం పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ గవాయ్‌లు 97వ రాజ్యాంగ సవరణలోని 9బీను సమర్థించగా...జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ ఈ సవరణ మొత్తాన్ని రద్దు చేయాలని భిన్నమైన తీర్పును రాశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 97వ రాజ్యాంగ సవరణకు 2011లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 19(1)(c)కి మార్పులు చేయడంతో ఆర్టికల్ 243Z Rలో పార్ట్‌ 9Bను అదనంగా చేర్చింది. ఈ సవరణలపై గుజరాత్‌ ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేయగా కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు.. తాజాగా తీర్పును వెలువరించింది. అయితే, రెండు లేదా అంతకంటే ఎక్కు రాష్ట్రాల్లో కొనసాగే సహకార సంఘాల పనితీరును మెరుగుపరిచేందుకు పాలకమండలిలో సభ్యులు, కార్యవర్గ సభ్యుల సంఖ్యపై పరిమితులు, పదవీ కాలవ్యవధి, ఎన్నికల నిర్వహణ, ఆడిటింగ్‌, జమాఖర్చుల సమర్పణ, నిష్ణాతులైన వ్యక్తుల నియామకాలకు సంబంధించి కొన్ని నిబంధలను విధించింది. ఏదైనా రాష్ట్ర పరిధిలోని అంశాలపై కేంద్రం చట్టం చేసినప్పుడు ఆర్టికల్ 368 ప్రకారం దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల ఆమోదాన్ని పొందాలి. కేంద్రం ఈ నిబంధనను ఉల్లంఘించి చేపట్టిన 97వ రాజ్యాంగ సవరణ చెల్లదంటూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది. అయితే, ఒకటికి మించిన రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహించే (బహుళ రాష్ట్ర) సహకార సంఘాల విషయంలో ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


By July 21, 2021 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-verdict-quashes-part-of-constitution-inserted-by-97th-amendment-on-cooperatives/articleshow/84604560.cms

No comments