‘సీఎం దేవుడు’ అంటూ మహావిష్ణువు ఆలయం ఎదుట ఫ్లెక్సీలు..!
ఆలయం ముందు ముఖ్యమంత్రి ఫోటోతో ఏర్పాటుచేసిన రెండు భారీ ఫ్లెక్సీలు కేరళలో చర్చనీయాంశమవుతున్నాయి. వీటిపై ‘సీఎం దేవుడు’ అని రాసిపెట్టడం దుమారానికి కారణమవుతోంది. మలప్పురం సమీపంలోని వలన్‌చెరి వద్ద పశిరి మహావిష్ణు దేవాలయం ముందు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ‘సీఎం పినరయి విజయన్ దేవుడు’..‘‘దేవుడంటే ఎవరని ఎవరినైనా అడిగితే మనకు ఆహారం పెట్టేవాడే దేవుడని చెబుతారు’’ అని విజయన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫ్లెక్సీలను రెండోసారి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా వేయించి ఉంటారని, తాజాగా ఇక్కడ పెట్టారని మహావిష్ణు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. సీపీఎం కార్యకర్తలే దీనిని వేయించి ఉంటారని అన్నారు. అయితే, వీటితో తమకెలాంటి సంబంధం లేదని స్థానిక సీపీఎం నేతలు ఖండించారు. ఆలయ వర్గాలు అభ్యంతరం తెలపడం, హిందూ సంఘాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై దుమారం రేగడంతో పోలీసులు వాటిని దేవాలయం పరిసరాల నుంచి 20 మీటర్ల దూరానికి తరలించారు. సీఎం విజయన్ సహా క్యాబినెట్ మంత్రుల ఫోటోలతో కూడిన ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టులు దేవతలని, దీనికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అందులో రాయడం గమనార్హం. మహావిష్ణు ఆలయ కమిటీ అధ్యక్షుడు రవీంద్రన్ మాట్లాడుతూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ‘ఆలయం సమీపంలో ఎన్నికల విజయాన్ని ప్రస్తావిస్తూ ఏర్పాటుచేసి ఫ్లెక్సీ వ్యతిరేకంగా కొంతమంది నిరసన వ్యక్తం చేశారు.. బోర్డును తగలబెట్టాలని చెప్పారు.. ఇది శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తుందని మేము ఆందోళన చెంది పోలీసులను సంప్రదించాం.. రెండో బోర్డును తొలగించాలని ఎస్ఐను కోరితే ఇంకా అక్కడే ఉంచారు.. సీఎం ఫ్లెక్సీ గత వారం వరకు అక్కడే ఉంది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని 20 మీటర్ల దూరంలో ఉన్న సమీప ప్రదేశానికి మార్చారు’ అని తెలిపారు.
By July 26, 2021 at 11:14AM
No comments