ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా.. పదవి చేపట్టిన నాలుగు నెలల్లోనే!
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తన రాజీనామా లేఖను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు అందజేశారు. అంతకు ముందు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తీరత్ సింగ్.. అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోపే పదవికి రాజీనామా చేయడం గమనార్హం. అయితే, రాజ్యాంగ సంక్షోభానికి దారితీయకుండా ఉండేందుకే తీరత్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రాజీనామా చేస్తారని మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీగా ఉన్న తీరత్‌ను బీజేపీ అధిష్ఠానం నాలుగు నెలల కిందట త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో సీఎంగా నియమించింది. దీంతో ఆయన ఆరు నెలల్లోపే శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగు నెలలు పూర్తికాగా.. సెప్టెంబర్ 10 నాటికి ఆరు నెలలు అవుతుంది. అయితే, రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కారణంగా ఉప ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి. గడువు ముగిసేవరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ఆయనతో రాజీనామా చేయించడమే ఉత్తమమని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు, సొంత పార్టీ నుంచే తీరత్ సింగ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీరత్ సింగ్ గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి పలుసార్లు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. చివరకు రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇక ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా బీజేపీ ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. అందులో భాగంగానే తీరత్ సింగ్ రావత్‌తో రాజీనామా చేయించి, సిట్టింగ్ అభ్యర్థికి సీఎం పగ్గాలు అప్పజెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్నాయి. జేపీ నడ్డాతో భేటీ అనంతరం తీరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, 2022 ఎన్నికల గురించి చర్చించామని తెలిపారు. ఉప-ఎన్నికల గురించి ప్రశ్నించగా.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందనిచ కేంద్రం ఏం నిర్ణయిస్తే దాని ప్రకారం ముందుకెళ్తామని అన్నారు. రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బీజేపీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై కొత్త సీఎంను ఖరారు చేయనుంది. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను పరిశీలకుడిగా పార్టీ నియమించింది.
By July 03, 2021 at 07:00AM
No comments