పెళ్లింట తీవ్ర విషాదం.. జనరేటర్ పేలి కొత్త జంట సహా ఆరుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జనరేటర్ పేలిన ఘటనలో గదిని చుట్టేసిన పొగతో ఊపిరాడక నవ దంపతులతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చంద్రాపూర్ పట్టణ సమీపంలోని దుర్గాపూర్ గ్రామ నివాసి రమేష్ లష్కరే గుత్తేదారుగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అజయ్ వివాహం పది రోజుల కిందట అదే గ్రామానికి చెందిన మాధురి అనే యువతితో జరిగింది. రెండు రోజుల క్రితం కోడలిని తీసుకురావడంతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. సోమవారం రాత్రి భారీ వర్షం పడటంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో పెళ్లి కోసమని అద్దెకు తెచ్చుకున్న జనరేటర్ ఇంట్లో ఉండడంతో దానిని ఆన్ చేశారు. భోజనాలు చేశాక అంతా నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పేలిపోయి పొగంతా గదిలోకి వ్యాపించింది. దీంతో ఊపిరాడక రమేష్ లష్కరే(45), అజయ్(25), మాధురి(20), వరుడి తోబుట్టువులు పూజ(14), లఖన్(10), కృష్ణ(8) అక్కడికక్కడే మృతి చెందారు. అజయ్ చిన్నాన్న బీసు లష్కర్(40) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
By July 14, 2021 at 07:18AM
No comments