Breaking News

షాకింగ్.. రెండు శునకాలకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకో తెలుసా?


హత్యలు చేసిన వారికి న్యాయస్థానాలు మరణశిక్ష విధించడం చూస్తూనే ఉంటాం.. కానీ ఓ దేశంలో కోర్టు రెండు శునకాలకు మరణశిక్ష విధించింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన జరిగిం మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లో. క‌రాచీలోని ఓ న్యాయవాదిపై దాడి చేశాయ‌న్న కార‌ణంగా రెండు జర్మన్ షెప‌ర్డ్ కుక్కల‌కు న్యాయస్థానం మ‌ర‌ణ‌శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే... కరాచీకి చెందిన మీర్జా అక్తర్ అనే సీనియ‌ర్ లాయ‌ర్ గ‌త నెల‌లో మార్నింగ్ వాక్ కోసం వెళ్లగా రెండు శునకాలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ దాడి దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. క్రూరమైన కుక్కలను ఇళ్ల మ‌ధ్య ఉంచినందుకు య‌జ‌మానిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడు స్వతహాగా లాయర్ కావడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో కుక్కల యజమాని హుమయూన్ ఖాన్ రాజీకొచ్చాడు. బాధితుడు అక్తర్ రాజీకి అంగీకరిస్తూనే కొన్ని షరతులు విధించాడు. తనకు క్షమాపణలు చెప్పడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాద‌క‌ర కుక్కల‌ను ఇంట్లో పెంచుకోవ‌ద్దని సూచించాడు. దీంతో పాటు తనపై దాడికి పాల్పడిన కుక్కలకు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి చంపేయాలని షరతు పెట్టాడు. దీనికి శునకాల యజమాని అంగీకరించడంతో ఇద్దరూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి కోర్టుకు సమర్పించారు. ఇరువర్గాలు రాజీకి రావడంతో ఒప్పందంలో పేర్కొన్న విధంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే ఈ ఒప్పందంపై జీవహ‌క్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


By July 14, 2021 at 06:37AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/two-german-shepherd-dogs-get-death-sentence-in-pakistan-for-attacking-lawyer/articleshow/84396296.cms

No comments