Breaking News

అత్తింటి నుంచి వచ్చేసిన నవ వధువు.. దారుణమై శిక్ష వేసిన పుట్టిళ్లు


మూడు నెలల కిందటే వివాహమైన ఓ యువతి అత్తింటి నుంచి పారిపోయిన పుట్టింటికి రాగా అక్కడ మద్దతు లభించలేదు సరికదా.. తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆమె పట్ల క్రూరంగా వ్యవహరించారు. జుట్టుపట్టుకుని ఈడ్చేసి, ఓ చెట్టుకు కట్టి కర్రలతో కొట్టి హింసించారు. అంతటితో ఆగకుండా వీడియోలు కూడా తీశారు. దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీరాజ్‌పూర్ జిల్లా భోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భడీ ఫౌల్ తల్వా అనే గిరిజన గ్రామంలో జూన్ 28న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత యువతి (19)కి మూడు నెలల కిందటే వివాహం జరిగింది. అయితే, కొద్ది రోజులకే అత్తింటి నుంచి పారిపోయి వచ్చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, బంధువులు యువతిని జట్టు పట్టుకుని ఇంటిలో నుంచి ఈడ్చి పడేశారు. అనంతరం ఓ చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఆమె కొడుతుండగా వీడియోలు తీశారు. వారి దెబ్బలకు తాళలేక బాధితురాలు అర్తనాదాలు చేసింది. ఈ సమయంలో ఓ వ్యక్తి ‘ఏడుపు ఆపు.. ఎప్పుడూ ఇంటికి రావద్దు’ అని అంటుంటే.. మరో వ్యక్తి కొడుతున్నట్టు వీడియోలో ఉంది. కర్ర విరిగే వరకూ ఆమె కొడుతూనే ఉన్నాడు. బాధితురాలిని చెట్టుకు కట్టేసి పరిహాసం చేయడం మరో వీడియోలో కనబడుతోంది. చుట్టూ చాలా మంది గుమిగూడి చోద్యం చూశారు కానీ ఏ ఒక్కరూ ఆమెను కాపాడటానికి ప్రయత్నించలేదు. యువతిని గొడ్డును బాదినట్టు చావగొడుతుండగా ఓ చిన్నారి కూడా అక్కడే నిలబడి చూస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. వీడియోలు ఆధారంగా ఘటన జూన్ 28న జరిగినట్టు గుర్తించి కేసు నమోదుచేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. ఆమె తండ్రి, సోదరులను అరెస్ట్ చేశారు. అత్తింటి నుంచి వచ్చేసిందనే కారణంతో మహిళను హింసించారని పోలీసులు పేర్కొన్నారు.


By July 03, 2021 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-dragged-by-hair-and-thrashed-by-father-for-leaving-in-laws-house-in-madhya-pradesh/articleshow/84087573.cms

No comments