Breaking News

థర్డ్‌ వేవ్‌ను మనమే ఆహ్వానించేలా ఉన్నాం: మోదీ షాకింగ్ కామెంట్స్


కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ఉంటేనే థర్డ్ వేవ్‌ను సమర్థంగా అడ్డుకోగలుగుతామని ప్రధానమంత్రి నరంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కొండ ప్రాంతాలు, మార్కెట్లలో ప్రజలు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తిరుగుతున్నారని, మూడో వేవ్‌ రాకుండా చూడాలంటే నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాల్సిందేనని హెచ్చరించారు. మూడో వేవ్‌ వచ్చేలోపే ఎంజాయ్‌ చేయాలని చాలా మంది అనుకుంటున్నారని, ఆ ధోరణిని విడనాడాలని కోరారు. మూడో వేవ్‌ దానంతటదే రాదని, మనం అజాగ్రత్తగా ఉంటే సెకండ్‌ వేవ్‌ను మించిన ప్రళయంగా విరుచుకుపడుతుందని హెచ్చరించారు. మంగళవారం అసోం, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం, మణిపూర్‌, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవీయ కూడా పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని చెప్పారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా వైరస్‌లో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని, అన్ని వేరియంట్లనూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని ప్రధాని చెప్పారు. కొత్త వేరియంట్లపై నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో నివారణ, చికిత్సే కీలకమని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల పర్యాటక, వాణిజ్యం రంగాలు తీవ్రంగా ప్రభావితమైన మాట వాస్తవమేనని, అయితే నిబంధనలు సడలించారన్న కారణంగా ప్రజలు మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా తిరగడం మంచిది కాదన్నారు. మూడో వేవ్‌ను ఎలా అడ్డుకోవాలన్న దానిపైనే మనమంతా దృష్టి పెట్టాలన్నారు. వైరస్‌పై నిర్లక్ష్యం, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లే కేసులు పెరుగుతున్నాయని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో ఈశాన్య రాష్ట్రాలకూ దేశంలోని ఇతర ప్రాంతాలతో సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. కరోనా పరీక్షలు, చికిత్సకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.23 వేల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య సదుపాయాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. పీఎం కేర్స్‌ నిధులతో ఈశాన్య రాష్ట్రాల్లో 150 ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


By July 14, 2021 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prime-minister-modi-shocking-comments-on-corona-third-wave/articleshow/84399643.cms

No comments