Breaking News

కిడ్నాపైన కొడుకు కోసం తండ్రి ఆరాటం.. 5లక్షల కి.మీ. ప్రయాణం, 24ఏళ్ల తర్వాత అరుదైన దృశ్యం


సాధారణంగా పిల్లలు ఎక్కడైనా తప్పిపోయినా, కిడ్నాప్‌కు గురైనా తల్లిదండ్రులు వారి కోసం కొద్ది నెలలో, కొన్నేళ్లే వెతికి వెతికి విసిగిపోయి చివరికి ఆశలు వదులుకుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం రెండేళ్ల వయసులో కిడ్నాప్‌కు గురైన తన కొడుకు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా మారి ఏకంగా 24ఏళ్లు వెతికాడు. ఇందుకోసం అతడు ఏకంగా 3లక్ష మైళ్లు(సుమారు 5లక్షల కిలోమీటర్లు) సుదీర్ఘ ప్రయాణం చేశాడు. అతడి పట్టుదల చూసి ఏ దేవుడు కరుణించాడో తెలీదు గానీ చివరికి అతడి ప్రయత్నం ఫలించింది. కొడుకు ఆచూకీ తెలుసుకుని అతడిని కలుసుకుని తనివితీరా హత్తుకున్ని ఏడ్చేశాడు. ఈ అరుదైన ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన గువా గాంగ్‌టాంగ్ కుమారుడు 1997లో రెండేళ్ల వ‌య‌సులో కిడ్నాప్‌కు గురైయ్యాడు. అప్పటినుంచి తన బిడ్డకోసం దేశమంతా వెతకడం ప్రారంభించాడు. ఆచూకీ దొరక్కపోయినా తన వేట కొనసాగించడం మాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే గాంగ్‌టాంగ్ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనేకసార్లు రోడ్డుప్రమాదాలకు గురై గాయాలు పాలైన ఘటనలూ ఉన్నాయి. గువా గాంగ్‌టాంగ్ క‌థ తెలుసుకున్న ఓ దర్శకుడు అతడి ప్రయాణంపై ఏకంగా ఓ సినిమానే తీశాడు. ఆ సినిమాలో హాంగ్‌కాంగ్ సూప‌ర్‌స్టార్ ఆండీ లువా న‌టించగా.. సంచలన విజయం సాధించింది. చివరికి గాంగ్‌టాంగ్ శ్రమ ఫలించి ఎట్టకేలకు తన కొడుకుని కలుసుకున్నాడు. అయితే ఆ యువకుడు తన కొడుకా? కాదా? అన్న అనుమానంతో అధికారులు డీఎన్ఏ పరీక్ష చేయగా ఇద్దరూ తండ్రీకొడుకులని తేలింది. వీరిద్దరూ కన్నీటిభాష్పాల మధ్య ఆత్మీయత కురిపించుకుంటూ కౌగిలింతల్లో మునిగితేలిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకున్న పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వశాఖ స్పందించి...ఈ కిడ్నాప్‌ ఘ‌ట‌న‌తో సంబంధమున్న ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. చైనాలో ఏటా వేల సంఖ్యలో పిల్లలు కిడ్నాప్‌కు గురవుతూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు కొద్దిరోజులు వెతికి చివరికి తమ బిడ్డలపై ఆశలు వదులుకుంటున్నారు. అయితే తన కొడుకు కోసం గువా గాంగ్‌టాంగ్ చేసిన పోరాటంపై సోషల్‌మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.


By July 14, 2021 at 10:18AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-man-reunited-with-son-abducted-24-years-ago/articleshow/84399226.cms

No comments