Breaking News

సెల్ఫీ కావాలంటే రూ.100 కట్టాల్సిందే.. మంత్రి ప్రకటనతో అభిమానులు షాక్!


సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో సెల్ఫీల కోసం పలువురు ఎగబడతారు. వారిని నిరుత్సాహపరచకూడదని భావించి ఎంతో సహనంతో ఫొటోలకు ఫోజులిస్తారు. అయితే తాజాగా, ఓ మంత్రి మాత్రం తనతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్న అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఇకపై తనతో ఎవరైనా సెల్ఫీ తీసుకోవాలంటే రూ.100 చెల్లించాలని షరతు విధించారు. ఈ షరతకు అభిమానులు అవాక్కయ్యారు. తనతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నవారు ఇకపై రూ.100 చెల్లించాల్సిందేనని మధ్యప్రదేశ్‌ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకుర్‌ స్పష్టం చేశారు. ఖాండ్వాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చాలామంది తనతో సెల్ఫీల కోసం ప్రయత్నిస్తుండటం వల్ల పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు గంటలకొద్దీ ఆలస్యం అవుతోందని, అందుకే ఈ షరతు విధించినట్లు ఆమె పేర్కొన్నారు. సెల్ఫీ తీసుకోవాలనుకున్న వారు డబ్బును స్థానిక మండల స్థాయి విభాగం ట్రెజరీలో చెల్లించాలని సూచించారు. ఈ సొమ్మును వ్యవస్థాపక పనుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు తెలిపారు. పుష్పగుచ్చాలకు బదులుగా తనకు పుస్తకాలు మాత్రమే ఇవ్వాలని ఆమె కోరారు. ‘పుష్పాలతో స్వాగతం పలికితే లక్ష్మీదేవి మనతో ఉన్నట్టు నమ్ముతాం.. కాబట్టి అన్ని పాపాలకు విముక్తి కలిగించే విష్ణువుకి తప్ప మరెవరికీ పువ్వులు స్వీకరించే హక్కు లేదు.. కాబట్టి నేను పుష్పగుచ్చాలను స్వీకరించను.. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయం చెప్పారు.. పుష్పాలకు బదులు పుస్తకాలు ఇవ్వాలి.. ఒక వేళ పుస్తకాలను సేకరిస్తే పార్టీ కార్యాలయంలో లైబ్రరీని ఏర్పాటుచేయవచ్చు.. విరాళంగా ఇవ్వవచ్చు’ అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌‌కు చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్నవారు ప్రధాని సహాయ నిధికి రూ.500 విరాళం ఇవ్వాలని ప్రకటించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.


By July 19, 2021 at 07:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/madhya-pradesh-minister-usha-thakur-says-who-wants-to-click-selfies-with-her-must-pay-rs-100/articleshow/84539715.cms

No comments