Breaking News

నేటి నుంచే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. బయటపడ్డ ఫోన్ హ్యాక్ వ్యవహారం


పార్లమెంట్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో నిబంధనల నడుమే సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే, ఈసారి సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం, సెకండ్‌ వేవ్‌‌ను ఎదుర్కొన్న తీరుపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం బయటపడటం పార్లమెంట్‌ను కుదిపేసే అవకాశం ఉంది. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో కేంద్రం వైఖరిపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తోంది. కొవిడ్, నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, రైతుల ఉద్యమం, రఫేల్‌ ఒప్పందం, ధరల పెరుగుదలతోపాటు ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఇప్పటికే నిర్ణయించింది. అటు ప్రాంతీయ పార్టీలు కూడా తమ సమస్యలను ప్రధానంగా లేవనెత్తనున్నాయి. కేంద్ర జల్‌శక్తి గెజిట్‌ నోటిఫికేషన్‌, విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై టీఆర్ఎస్.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ ఉక్కు వంటి అంశాలను లేవనెత్తాలని వైఎస్ఆర్సీపీ... ఏపీ ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతల అంశాలపై ప్రశ్నించాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు, పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో నిర్వహించిన ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని అన్ని పార్టీలకు ఈ సందర్భంగా అధికారపక్షం విజ్ఞప్తి చేసింది. సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను మంత్రి ప్రహ్లాద్‌ జోషి అఖిలపక్ష భేటీలో వివరించారు. దాదాపు 31 బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. అన్ని సమస్యలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. అమలులో ఉన్న ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జనాభా నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో పాటు విద్యుత్‌ బిల్లులను కూడా మరోసారి సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. వర్షాకాల సమావేశాలను ఆగస్గు 13 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 29 బిల్లులు, రెండు ఆర్ధిక అంశాలను కేంద్రం ప్రవేశపెట్టనుంది. అలాగే, ఆరు ఆర్డినెన్సులకు చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది.


By July 19, 2021 at 08:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/monsoon-session-of-parliament-to-start-today-covid-fuel-prices-hike-on-agenda/articleshow/84540035.cms

No comments