Kashmir లష్కరే టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్‌లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. శ్రీనగర్ సమీపంలో పరింపొరా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది నదీమ్ అబ్రార్ హతమైనట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. ఉగ్రవాది అబ్రార్ పరింపొర చెక్‌పోస్ట్ వద్ద సోమవారం పట్టుబడినట్టు పోలీస్ విభాగం అధికార ప్రతినిధి పేర్కొన్నారు. పలు ఉగ్ర దాడులు, సైనికుల హత్యల్లో అబ్రార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని అన్నారు. జాతీయ రహదారులపై దాడులకు ఉగ్రవాదులు కుట్రపన్నారనే సమాచారం మేరకు భదత్ర బలగాలు తనిఖీలు చేపట్టాయి. జాతీయరహదారి వెంబడి జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుచేసి సోదాలు నిర్వహిస్తుండగా.. పరింపొర వద్ద ఉగ్రవాది నదీమ్ అబ్రార్ పట్టుబడ్డాడు. ‘‘పరింపొర వద్ద వాహానాన్ని నిలిపిన భద్రతా బలగాలు.. అందులోని వ్యక్తుల గుర్తింపు గురించి ఆరా తీశారు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి బ్యాగు తెరచి గ్రనేడ్ తీయడానికి ప్రయత్నించాడు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకుని కిందకు దించారు. మాస్క్ తొలగించడంతో లష్కరే ఉగ్రవాది అబ్రార్‌గా గుర్తించారు’’అని అధికార ప్రతినిధి వెల్లడించారు. అబ్రార్ వద్ద హ్యాండ్ గ్రనేడ్లు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారని, విచారణలో ఏపీ 47 రైఫిల్ దాచిపెట్టిన చోటు గురించి చెప్పాడన్నారు. ఆ ప్రాంతానికి అబ్రార్‌ను తీసుకెళ్లినప్పుడు అక్కడ ఉన్న మరి కొందరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం ధీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపింది.. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. అబ్రార్ సహా ఆ ఇంటిలో ఉన్న మరో ఉగ్రవాది హతమైనట్టు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలిలో రెండు ఏకే 47 రైఫిల్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
By June 29, 2021 at 09:05AM
No comments