Breaking News

గవర్నర్ ధన్ఖర్ అవినీతిపరుడు.. ఆ కేసులో ముడుపులు: మమతా సంచలన వ్యాఖ్యలు


పశ్చిమ్ బెంగాల్ గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గవర్నర్‌ జగదీప్‌ ధన్ఖర్‌ను అవినీతిపరుడంటూ సీఎం సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. సెక్రటేరియట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ అవినీతి పరుడని, బెంగాల్‌ విభజనకు కుట్రపన్నుతున్నారని దుయ్యబట్టారు. 1996 నాటి జైన్ హవాలా వ్యవహారంలో ముడుపులు అందుకున్న రాజకీయ నేతల జాబితాలో ఆయన కూడా ఉన్నారని మమతా బెనర్జీ ఆరోపించారు ‘‘ఆయన అవినీతిపరుడు.. 1996నాటి జైన్‌ హవాలా కేసు ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరు ఉంది.. కోర్టుకు వెళ్లారు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పెండింగ్‌లో ఉంది.. మీరు తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటంటే ఆయన అవినీతిపరుడు.. అలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గవర్నర్‌గా కొనసాగిస్తోంది.. ఆ ఛార్జ్‌షీట్‌‌లో ఆయన పేరు ఉందా? లేదా అని పరిశీలించాలి’’ అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ధన్ఖర్ ఉత్తర బెంగాల్‌ ప్రాంతంలో ఎందుకు పర్యటిస్తున్నారని మమత నిలదీశారు. అది ఓ రాజకీయ నాటకమని అభివర్ణించారు. ‘‘అది రాజకీయ నాటకం. కేవలం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలనే కలుస్తున్నారు.. ఆయన ఆకస్మికంగా ఉత్తర బెంగాల్‌ పర్యటనకు ఎందుకు వెళ్లారు? ఉత్తర బెంగాల్‌ విభజనకు కుట్ర పన్నుతున్నారని అనిపిస్తోంది’’ అని ఆరోపించారు. ఉత్తర బెంగాల్, జంగల్‌మహల్‌ను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటుచేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండటంతో గవర్నర్ పర్యటనపై దీదీ అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై స్పందించిన గవర్నర్‌ జగదీప్ ధన్ఖర్ తీవ్రంగా ఖండించారు. ఆమె ఆరోపణలన్నీ అవాస్తమని కొట్టిపారేశారు. ‘‘మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో అణుమాత్రమైనా నిజం లేదు.. ఛార్జ్‌షీట్‌లో నా పేరు లేదు.. అందుకు ఎటువంటి ఆధారాలు లేవు.. అనుభవజ్ఞులైన రాజకీయ నేత నుంచి ఈ విధమైన వ్యాఖ్యలను నేను ఊహించలేదు.. అసెంబ్లీని ఉద్దేశించి చేయాల్సిన ప్రసంగంపై నేను కొన్ని ప్రశ్నలు అడిగా.. అనంతరం పది నిమిషాలకే నాపై ఆరోపణలు చేశారు’ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో గవర్నర్‌గా ధన్ఖర్ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే మూడేళ్లుగా ఇరువురి మధ్య యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఎజెండాను బెంగాల్‌లో అమలుచేయడానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని అధికార టీఎంసీ ఆరోపిస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, వరుసగా మూడోసారి మమతా బెనర్జీ అధికారం చేపట్టారు. ఫలితాల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్రానికి పదే పదే నివేదికలు పంపుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నుతున్నారని టీఎంసీ దుయ్యబడుతోంది.


By June 29, 2021 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-cm-mamata-banerjee-fresh-offensive-against-governor-jagdeep-dhankar/articleshow/83942250.cms

No comments