Breaking News

లక్షద్వీప్‌పై మరో వివాదస్పద ప్రతిపాదన.. కేరళ నుంచి కర్ణాటకకు న్యాయపరిధి!


లక్షద్వీప్ పరిపాలనా యంత్రాంగం వివాదాస్పద నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా వారి మనోభావాలతో తమకెలాంటి సంబంధం లేదనే ధోరణి ప్రదర్శిస్తూ పరిపాలన అధికారి ముందుకెళ్తున్నారు. తాజాగా, మరో వివాదాస్పద ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. లక్షద్వీప్‌ న్యాయపరిధిని కేరళ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు మార్చే ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. లక్షద్వీప్‌ పరిపాలన అధికారి ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ ప్రతిపాదిత చట్టాలు విమర్శలు పాలైన విషయం తెలిసిందే. గూండా చట్టం, జంతు రక్షణ చట్టం, మద్యపాన నిషేధాన్ని అన్ని దీవుల నుంచి ఉపసంహరించడం లాంటి నిర్ణయాలపై లక్షద్వీప్‌ వాసులు గుర్రుగా ఉన్నారు. ఈ ముసాయిదా చట్టాలకు సంబంధించి 11 రిట్‌ పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో న్యాయపరిధిని కేరళ నుంచి కర్ణాటకకు మార్చాలని లక్షద్వీప్‌ పరిపాలనా యంత్రాంగం ప్రతిపాదించింది. ఖోడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని లక్షద్వీప్ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ ఆరోపించారు. లక్షద్వీప్‌ మాతృభాష మలయాళమని, అలాంటప్పుడు న్యాయపరిధిని కర్ణాటకకు మార్చాలన్న ప్రతిపాదనలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రతిపాదన అమలుకు పార్లమెంట్‌ ఆమోదం తప్పనిసరని, అక్కడ దీన్ని అడ్డుకుంటామని ఫైజల్‌ స్పష్టం చేశారు. అయితే న్యాయపరిధి కేరళ నుంచి కర్ణాటకకు మారుస్తున్న ఊహాగానాలపై లక్షద్వీప్‌ పరిపాలనా యంత్రాంగం ఆదివారం రాత్రి ఒక ప్రకటన చేసింది. అటువంటి ప్రతిపాదనేదీ లేదంటూ జిల్లా కలెక్టర్‌ అస్కర్‌ అలీ తెలిపారు. ప్రకృతి అందాలకు, బీచ్‌లకు నిలయమైన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ నిరసనలతో హోరెత్తిపోతోంది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్ కె. పటేల్ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులుగా లక్షద్వీప్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అక్కడ ప్రజల ఆందోళనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మలయాళీ హీరోలు, సెలెబ్రిటీలు, కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు అండగా నిలబడి ప్రఫుల్ పటేల్‌ను వెనక్కు పిలవాలంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి లేఖలు రాశారు.


By June 21, 2021 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lakshadweep-administration-to-proposal-for-shifting-hc-jurisdiction-from-kerala-to-karnataka/articleshow/83707897.cms

No comments