Breaking News

పౌరులను అక్రమంగా నిర్బంధిస్తే పరిహారం చెల్లించాలి.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు


ప్రభుత్వ అధికారులు చేతిలో వేధింపులకు గురయిన వ్యక్తులకు పరిహారం ఇవ్వడం వ్యక్తిగతంగా సంతృప్తికరంగా ఉండటమే కాదు, సామాజిక చెడును దూరం చేయడానికి సహాయపడుతుందని నొక్కిచెప్పింది. పోలీసులు అక్రమంగా నిర్బంధించిన ఇద్దరి యువకుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఈ విధంగా స్పందించింది. బాధితుడికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పౌరుడిని అక్రమంగా నిర్బంధించిన ప్రభుత్వ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని, బాధితుడికి రూ .25,000 పరిహారం చెల్లించేలా యూపీ ప్రభుత్వ తీసుకున్న విధానపర నిర్ణయాన్ని జస్టిస్ సూర్యప్రకాశ్ కేసర్వానీ, జస్టిస్ షమీమ్ అహ్మద్‌ల ధర్మాసనం ప్రశంసించింది. అక్రమంగా నిర్బంధించిన ఇద్దరు యువకులను ధ్రువీకరణ సాకుతో వ్యక్తిగత పూచీకత్తు, ఇతర పత్రాలను సమర్పించినప్పటికీ విడుదల చేయకపోవడంపై బాధితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ‘రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించే అధికారులు కమిషన్ లేదా చట్టాల అమలును అప్పగించిన న్యాయస్థానం ముందు ప్రవర్తనకు జవాబుదారీగా ఉండాలి’ అని వ్యాఖ్యానించింది. 1994 నాటి లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ Vs ఎంకే గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఉదాహరణగా చూపింది. ‘‘చట్టం అప్పగించిన విధులను నిర్వర్తించడంలో విఫలమైన అధికారుల నుంచి పరిహారం పొందడానికి ఫిర్యాదుదారునికి అర్హత ఉంది.. ఆ మొత్తాన్ని వెంటనే ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించవచ్చు.. కానీ క్షమించరాని ప్రవర్తనకు కారణమైన వారి నుంచి తిరిగి పొందాలి’’ అని స్పష్టం చేసింది. ముఖ్యంగా సామాన్యుడు లేదా సాధారణ పౌరుడుపై ప్రభుత్వం, వ్యవస్థలు అధికార దుర్వానియోగంతో అణచివేతకు పాల్పడితే తిరుగుబాట్లు వస్తాయని కోర్టు అభిప్రాయపడింది. ‘ప్రభుత్వ అధికారులు ఒక సామాన్యుడిని వేధింపులకు గురిచేయడం సామాజికంగా, చట్టబద్ధంగా అనుమతిలేదు.. అది అతడికి వ్యక్తిగతంగా హాని కలిగించవచ్చు.. కానీ ఆ గాయం సమాజానికి చాలా చేటు కలిగిస్తుంది’అని వ్యాఖ్యానించింది.


By June 14, 2021 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/persons-under-illegal-detention-shall-be-paid-compensation-by-state-says-allahabad-high-court/articleshow/83502083.cms

No comments