Breaking News

ప్రాణహాని ఉందని పోలీసులకు జర్నలిస్ట్ లేఖ.. మర్నాడే జరగరాని ఘోరం


లిక్కర్ మాఫియా నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదుచేసిన మర్నాడే టెలివిజన్ జర్నలిస్ట్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం అనుమానాలకు తావుస్తోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఏబీపీకి చెందిన ఏబీపీ గంగాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న సులాభ్ శ్రీవాస్తవ ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ప్రతాప్‌గఢ్‌లో లిక్కర్ మాఫియాపై కథనాన్ని ప్రచురించడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ శ్రీవాస్తవ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘మీడియా కవరేజ్‌ కోసం వెళ్లి ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై శ్రీవాస్తవ ఇంటికి తిరిగొస్తున్నారు.. ఇటుక బట్టీల సమీపంలో బైక్‌పై నుంచి పడిపోయారు.. అక్కడ కొంత మంది కూలీలు ఆయనను పైకిలేపి, మిత్రులకు ఫోన్ చేశారు.. తర్వాత అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు’’ అని ప్రతాప్‌గఢ్ ఎస్పీ సురేంద్ర ద్వివేది ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘శ్రీవాస్తవ ఒంటిరిగా ద్విచక్రవాహనంపై వస్తుండగా.. రోడ్డు పక్కన ఉన్న చేతిపంపును ఢీకొట్టి కిందపడిపోయారని ప్రాథమిక విచారణలో తేలింది.. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం’’ అని ద్వివేది పేర్కొన్నారు. అయితే, ఘటనా స్థలిలో పడి ఉన్న మృతదేహంపై మాత్రం అనుమానాస్పద గాయాలున్నాయి. జర్నలిస్ట్ ముఖంపై గాయాలతోపాటు షర్ట్ దాదాపు పూర్తిగా తీసేసి ఉండగా.. ప్యాంటు బటన్స్ విప్పి కిందకు జారి ఉంది. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీస్ అధికారికి జర్నలిస్ట్ శ్రీవాస్తవ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘జిల్లాలో లిక్కర్ మాఫియా గురించి జూన్ 9న తమ వెబ్‌సైట్‌లో కథనం రాశాం.. అప్పటి నుంచి ఈ నివేదిక సంచలనంగా మారింది.. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరో నన్ను వెంబడిస్తున్నారనే అనుమానం కలుగుతోంది.. ఈ కథనంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న లిక్కర్ మాఫియా తనకు హానితలపెట్టే ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు చెప్పారు.. నా కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది’’ అని శ్రీవాస్తవ తన లేఖలో రాశారు. జర్నలిస్ట్ మృతితో మరోసారి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్‌లో మండిపడ్డారు. ‘‘అలీగఢ్ నుంచి ప్రతాప్‌గఢ్ నుంచి లిక్కర్ మాఫియా హత్యలు చేస్తుంటే యూపీ ప్రభుత్వం మౌనంగా ఉంది.. జర్నలిస్టులు సత్యాన్ని బహిర్గతం చేయడానికి ప్రమాదకరమైన ప్రశ్నలు అడుగుతున్నారు.. ప్రభుత్వం నిద్రపోతోంది.. జంగిల్ రాజ్‌ను పెంచి పోషిస్తున్న యూపీ ప్రభుత్వానికి జర్నలిస్ట్ సులాబ్ శ్రీవాస్తవ కుటుంబ సభ్యుల కన్నీళ్లకు ఏమైనా సమాధానం ఉందా?’’ అని దుయ్యబట్టారు.


By June 14, 2021 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/day-after-flagging-mafia-threat-journalist-dies-in-uttar-pradesh/articleshow/83502961.cms

No comments