Breaking News

భార్య చేతిలో హత్యకు గురైన టెక్కీ.. ఆవేశంలో భర్తను కత్తితో పొడిచిన మహిళ


భార్యతో గొడవపడి ఆమె చేతిలోనే భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య వాగ్వాదం చినిచినికి గాలివానలా మారి భర్త మరణానికి కారణమయ్యింది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. కూరగాయలు కోసే కత్తితో భర్తను పొడిచింది. ఆ సమయంలో వారి ఇద్దరి పిల్లలూ అక్కడే ఉన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతి పార్క్ కాలనీకి చెందిన మృతుడు సచిన్ కుమార్, అతడి భార్య గుంజన్ మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన గుంజన్.. వంటింట్లో కత్తి తీసుకొచ్చి భర్త గుండెల్లో బలంగా పొడించింది. గొడవ జరిగినప్పుడు ఉద్రేకంతోనే నాన్నను అమ్మ కత్తితో పొడిచినట్టు వారి 11 ఏళ్ల కుమార్తె చెప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్టు గురుగ్రామ్ ఎస్పీ (క్రైమ్) ప్రీత్‌పాల్ సింగ్ చెప్పారు. సచిన్ సోదరుడు నీరజ్ ఫిర్యాదు మేరకు గుంజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదచేసినట్టు పేర్కొన్నారు. భార్య చేతిలోని కత్తిని లాక్కోవడానికి సచిన్ ప్రయత్నించడంతో అతడికి గాయాలయ్యాయని అన్నారు. గాయపడిన అతడిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల అప్పటికే చనిపోయాడని వివరించారు. వదిన గుంజన్‌ను తక్షణమే అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని సచిన్ చెల్లెళ్లు రేష్మా, శిల్పా డిమాండ్ చేస్తున్నారు. హంతుకురాలిని కఠినంగా శిక్షించాలని కోరారు. అంతేకాదు, ‘‘అమ్మాయి భయపడుతోంది.. తల్లి మభ్యపెట్టడంతో నిజాలు మాట్లాడటానికి తడబడుతోంది.. తండ్రిని అనుకోకుండా కత్తితో పొడిచినట్టు చెప్పిన మాటలు నిజం కాదు.. ఆమె ఉద్దేశపూర్వకంగానే పొడిచి చంపింది’’ అని సచిన్ సోదరి రేష్మా ఆరోపించారు. ‘‘సచిన్ ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఆదివారం వెళ్లిపోతారు.. ఈసారి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.. సచిన్ గొంతు వినిపించలేదు.. గుంజన్ గట్టిగా అరుస్తోంది.. ఏం జరుగుతోందని మేము వెళ్లేసరికి గదిలో వారిద్దరూ వాదించుకుంటున్నారు’’ అని పక్కంటి సరోజ్ భరద్వాజ్ అనే వ్యక్తి చెప్పాడు. కేసు నమోదుచేసిన పోలీసులు.. ఏం జరిగిందనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసి కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు.


By June 21, 2021 at 12:52PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/software-engineer-stabbed-to-death-by-wife-children-too-were-at-home-in-gurgaon/articleshow/83709881.cms

No comments