కోవిడ్ మరణాలు అధికారిక ప్రకటన కంటే ఏడు రెట్లు ఎక్కువ.. ది ఎకనమిస్ట్ సంచలన కథనం


భారత్‌లో కోవిడ్ మరణాలు అధికారిక సంఖ్య కంటే ఐదు నుంచి ఏడు రెట్లు ఎక్కువగా ఉంటాయని ‘ది ఎకనమిస్ట్’ మ్యాగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని భారత్ శనివారం తీవ్రంగా ఖండించింది. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఊహాజనితంగా అంచనా వేశారని కొట్టిపారేసింది. అంతేకాదు కోవిడ్ మరణాలను అంచనా వేసేందుకు సదరు మ్యాగజైన్ అనుసరించిన విధానాలు.. ఏ దేశంలో లేదా ప్రాంతంలో మరణాల రేటు లెక్కింపునకు చెల్లుబాటు కానివని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. ఆ అధ్యయనానికి విశ్వసనీయత ఎందుకు లేదో కూడా వివరించింది. పబ్‌మెడ్, రీసెర్చ్ గేట్ వంటి శాస్త్రీయ డేటాబేస్‌లలో ఈ అధ్యయనం కనిపించలేదని, సదరు మ్యాగజైన్ సైతం మెథడాలజీ వివరాలను వెల్లడించలేదని తెలిపింది. కొవిడ్ డేటా నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ అధ్యయనంలో తెలంగాణలో బీమా క్లెయిమ్‌లను సాక్ష్యాలుగా చూపిందని, అటువంటి అధ్యయనంపై సమీక్షించిన శాస్త్రీయ సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. ‘‘పోల్ ఫలితాలను నిర్వహించడం, అంచనా వేయడం, విశ్లేషించడంలో ప్రావీణ్యం ఉన్న సర్వే సంస్థలు ‘ప్రజ్ఞం’ ‘సి-ఓటర్’ అధ్యయనాలు చేశాయి.. వారికి ఎప్పుడూ ప్రజారోగ్య పరిశోధనతో సంబంధం లేదు.. సెఫాలజీలోనూ పోల్ ఫలితాలను అంచనా వేయడానికి వారి పద్దతులు చాలాసార్లు గుర్తింపు పొందలేదు’’ అని తెలిపింది. మ్యాగిజైన్ అంచనాలు స్థానిక ప్రభుత్వ డేటా, సంస్థ రికార్డుల నుంచి బహిష్కరించబడ్డాయి అని ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ డేటా మేనేజ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని తెలిపింది. మరణాల సంఖ్యపై అస్థిరతను నివారించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) 2020 మేలో మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని మరణాలను సక్రమంగా నమోదుచేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేసిన ఐసీడీ -10 కోడ్‌లను అనుసరిస్తున్నామని వివరించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అధికారిక సమాచార మార్పిడి, వీడియో సమావేశాల ద్వారా, కేంద్ర బృందాలను మోహరించడం ద్వారా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మరణాల నమోదు సక్రమంగా జరుగుతోంది. రోజూ జిల్లా వారీగా కేసులు, మరణాల పర్యవేక్షణకు బలమైన రిపోర్టింగ్ విధానం అవసరాన్ని కూడా క్రమం తప్పకుండా నొక్కిచెప్పినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘రోజువారీ మరణాలను తక్కువ సంఖ్యలో నివేదించే రాష్ట్రాలు తమ డేటాను తిరిగి తనిఖీ చేయాలని ఆదేశించాం.. ఉదాహరణగా కేంద్రం లేఖ రాయడంతో బీహార్ కోవిడ్ మరణాల సంఖ్యను సవరించింది’అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నివేదికకు ఎటువంటి శాస్త్రీయత లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్‌వర్దన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
By June 13, 2021 at 12:32PM
No comments