Breaking News

కశ్మీర్: ఇంట్లోకి చొరబడి పోలీస్ అధికారి దంపతులను కాల్చిచంపిన ఉగ్రవాదులు


జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. ప్రత్యేక పోలీస్ అధికారి, అతడి భార్యను ఉగ్రవాదులు కాల్చి చంపారు. పుల్వామా జిల్లా అవంతిపొర హరిపారిగామ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీస్ అధికారి ఫయాజ్ అహ్మద్ నివాసంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. కుటుంబంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఎస్పీఓ ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య రజా బేగమ్ సహా కుమార్తె గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలించగా.. అధికారి, ఆయన భార్య అప్పటికే చనిపోయారు. ప్రస్తుతం పోలీస్ అధికారి కుమార్తె రఫియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాల్పుల గురించి సమాచారం అందుకున్న భద్రత దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. సైన్యం అధీనంలోని జమ్మూ విమానాశ్రయంపై డ్రోన్ల దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారు. జమ్ము విమానాశ్రయంలోని అత్యంత పటిష్ఠ భద్రతావలయంలో ఉండే వైమానిక స్థావరంపై ఆదివారం రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల(ఐఈడీ)ను జారవిడిచాయి. వేకువ జామున 1:40 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇది ఉగ్రదాడేనని జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ ప్రకటించారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులు, జమ్మూ కశ్మర్ పోలీసుల, ఇతర జాతీయ భద్రతా సంస్థలు ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నాయని డీజీపీ తెలిపారు. ఎన్‌ఐఏ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పాకిస్థాన్ సరిహద్దుకు దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉండే శత్రుదుర్బేధ్యమైన వైమానిక స్థావరంపై దాడి జరగడం గమనార్హం.


By June 28, 2021 at 07:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/special-police-officer-and-his-wife-shot-dead-at-home-by-terrorists-in-pulwama/articleshow/83909125.cms

No comments