Breaking News

Ayodhya Templeలో అవినీతి కలకలం.. రూ.2 కోట్ల భూమికి 18.5 కోట్లు చెల్లింపు!


అయోధ్య రామమందిర నిర్మాణంలో అవినీతి పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపించడం కలకలం రేగుతోంది. భూములు కొనుగోలు వ్యవహారంలో రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌‌ అవినీతికి పాల్పడిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌, యూపీ మాజీ మంత్రి పవన్‌ పాండేలు ఆరోపించారు. దీని వెనక ‘రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు’ సభ్యుడు అనిల్‌ మిశ్రా పాత్ర ఉందని పేర్కొన్నారు. ఆలయం కోసం కొనుగోలు చేస్తున్న భూములపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య జిల్లా సదర్‌ తహ్‌శీల్‌ పరిధిలో 1.208 హెక్టార్ల భూమిని ఈ ఏడాది మార్చి 18న ఒక వ్యక్తి రూ.2 కోట్లకు కంటే, కొన్ని నిమిషాల్లోనే దానిని రూ.18.5 కోట్లకు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. రామాలయ నిర్మాణం కోసం విరాళాలిచ్చిన కోట్ల మంది భక్తుల విశ్వాసాలతో ఈ వ్యవహారం ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. కుసుమ్‌, హరీశ్‌ పాఠక్‌ అనే వ్యక్తుల నుంచి రవి మోహన్‌, సుల్తాన్‌ అన్సారీ ఆ భూమిని రూ.2 కోట్లకు కొనుగోలు చేశారని, అది జరిగిన ఐదు నిమిషాలకే వారి నుంచి ట్రస్ట్‌ కొనుగోలు చేసిందని వివరించారు. ఇందుకోసం రూ.16.5 కోట్లు అదనంగా చెల్లించినట్లు ఆరోపించారు. రెండు లావాదేవీలకు ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్రా, అయోధ్య మేయర్‌ రిషికేశ్‌ ఉపాధ్యాయ సాక్షులుగా వ్యవహరించారని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత పవన్‌ పాండే సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. కేవలం 10 నిమిషాల్లో భూమి విలువ 10 రెట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొన్ని పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. ‘కోట్లాది మంది తాము పొదుపుచేసుకున్న సొమ్మును ఆలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు.. ఆ సొమ్మును మీరేం చేశారు.. ఇది 120 కోట్ల మంది భారతీయులను అవమానించడమే దీనిపై సీబీఐ విచారణ జరపాలి’’ అని కోరారు. ఈ ఆరోపణలపై వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు, రామ మందిర్‌ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ స్పందించారు. ఈ ఆరోపణలను తాము పట్టించుకోబోమని, గత వందేళ్లుగా ఇలాంటివి చేస్తూనే వస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌ను 2020 ఫిబ్రవరిలో ప్రధాని ఏర్పాటుచేశారు. ఇందులో మొత్తం 15 సభ్యుల్లో 12 మందిని కేంద్రం నామినేట్ చేసింది.


By June 14, 2021 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/opposition-parties-accused-ayodhya-ram-temple-trust-of-land-scam/articleshow/83500073.cms

No comments