Breaking News

మొదటి ఏడాది కంటే ప్రమాదకరంగా మహమ్మారి.. WHO తీవ్ర హెచ్చరికలు


ఒలింపిక్స్‌ను రద్దు చేయాలన్న నినాదం ఊపందుకున్న వేళ జపాన్ పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని పొడిగించింది. ఇదే సమయంలో కోవిడ్ -19 గురించి ప్రపంచానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం భయంకరమైన హెచ్చరికలు జారీచేసింది. ఈ ఏడాది కూడా "మహమ్మారి చాలా ప్రమాదకరంగా" ఉందని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారి మొదటి ఏడాది కంటే రెండో ఏడాది చాలా ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించామని ఆందోళన వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌కు 10 వారాల ముందు మరో మూడు ప్రాంతాలలో కరోనా అత్యవసర పరిస్థితిని జపాన్‌ ప్రకటించడంతో క్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇదే సమయంలో ఒలింపిక్స్‌ను రద్దుచేయాలని 350,000 మందికి పైగా సంతకాలతో పిటిషన్‌ను సమర్పించారు. ఇప్పటికే టోక్యో సహా పరిసర ప్రాంతాల్లో మే చివరి వరకు అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా, ఒలింపిక్ క్రీడలు జరగనున్న హిరోషిమా, ఓకయామా, ఉత్తర హక్కైడో‌లు ఆ జాబితాలో చేరాయి. జపాన్‌లో నాలుగో దశ వ్యాప్తికి ఆస్కారముందని, ఒలింపిక్స్ రద్దుచేయాలని ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడయ్యింది. కాగా, క్రీడల కంటే ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఒలింపిక్ నిర్వాహకులకు జపాన్ నేత కెంజి ఉట్సోనోమియా లేఖ రాశారు. కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 3,346,813 మందిని పొట్టనబెట్టుకుంది. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రపంచానికి మోడల్‌గా నిలిచిన తైవాన్ మరోసారి కోవిడ్ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. పైలట్లలో వైరస్ నిర్ధారణ కావడంతో వినోద, లైబ్రరీ, క్రీడా ప్రాంగణాలను మూసివేసింది. ఇప్పటి వరకూ ఆ దేశంలో కేవలం 1,290 కేసులు, 12 మరణాలు మాత్రమే చోటుచేసుకున్నాయి. భారత్‌లో వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్‌పై డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రెండో దశ వ్యాప్తికి కారణమవుతోన్న B.1.617 వేరియంట్‌ను భారత్‌లో తొలిసారిగా అక్టోబరులోనే గుర్తించారని అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం B.1.617 వేరియంట్ అత్యంత ప్రమాదకారని, మేము దీనిని ప్రపంచ స్థాయి వైవిధ్యంగా వర్గీకరిస్తున్నామని తెలిపింది.


By May 15, 2021 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-to-be-far-more-deadly-this-year-warns-who/articleshow/82649750.cms

No comments