Breaking News

ఈజిప్టు దౌత్యం విఫలం.. Gaza వద్ద 9వేల సైన్యాలను మోహరించిన ఇజ్రాయేల్


ఇజ్రాయేల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య సయోధ్యకు ఈజిప్ట్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముస్లింలకు పవిత్రమైన ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నాడు కూడా పరస్పర దాడులు కొనసాగాయి. హమాస్‌ ఉగ్రవాదులు వందల సంఖ్యలో రాకెట్లను ప్రయోగిస్తుండగా... గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయేల్ విరుచుకుపడుతోంది. ఘర్షణలు ముమ్మరం కావడంతో 9 వేల మంది రిజర్వుడు సైనికులను గాజా సరిహద్దుల్లో ఇజ్రాయేల్‌ మోహరించింది. దీంతో రాకెట్‌, వైమానిక దాడులు నుంచి ఘర్షణలు భూభాగానికీ పాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇజ్రాయేల్ దాడులతో గాజా నగరం చిగురుటాకులా వణుకుతోంది. ఆ నగరం సరిహద్దుల నుంచి వేలాదిగా పాలస్తీనియన్లు ప్రాణభయంతో వలసబాట పట్టారు. గాజా నుంచి హమాస్‌ ఉగ్రవాదులు శుక్రవారం వరకు 1,800 రాకెట్లను ప్రయోగించారు. అయితే, ఈ రాకెట్లలో 90 శాతాన్ని ఇజ్రాయేల్‌ ఐరన్‌ డోమ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంటోంది. పాలస్తీనాపై ఇజ్రాయేల్ ఇప్పటికే 600కు పైగా వైమానిక దాడులు చేయడంతో గాజాలో మృతుల సంఖ్య 120కి పెరిగింది. 1,000 మందికిపైగా గాయపడ్డారు. వైమానిక దాడుల్లో భారీ భవనాలు కుప్పకూలుతున్నాయి. శుక్రవారం ఓ భారీ భవనం కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గర్భిణి మహిళ, ఆమె భర్తతోపాటు వారి నలుగురు చిన్నారులు ఉన్నారు. ఇదిలా ఉండగా, గాజాపై దాడులను ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు శుక్రవారం మరోసారి సమర్ధించుకున్నారు. ‘‘ తమ రాజధానిపై దాడి చేశారు... తమ నగరాలపై రాకెట్‌లను ప్రయోగించారు.. ఈ దుస్సహాసానికి వారు మూల్యం చెల్లించుకుంటారు’’ అంటూ టెలి అవీవ్‌లో భద్రత బలగాల ప్రధాన కార్యాలయంలో పరిస్థితి సమీక్షించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వైమానిక దాడులను నిరసిస్తూ ఇజ్రాయేల్‌ ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని పలు ప్రాంతాల్లో పాలస్తీనియన్లు శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇజ్రాయేల్ సైన్యంపై రాళ్లు రువ్వారు. వీరిపై బలగాలు కాల్పులు జరపడంతో వేర్వేరు చోట్ల 10 మంది మృత్యువాతపడ్డారు. తాజా ఉద్రిక్తతలపై ఇజ్రాయేల్‌ ప్రధానితో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. కాగా, ఇజ్రాయేల్‌తో ఘర్షణ కొనసాగుతున్నా.. పాలస్తీనాలో శాంతిస్థాపన కోసం నిధులకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. వెస్ట్ బ్యాంక్‌, గాజాలోని పాలస్తీనియన్ల కోసం ఇజ్రాయేల్ సహకారంతో చేపట్టే ప్రాజెక్టులకు 10 మిలియన్ డాలర్లు సాయానికి గురువారం ఆమోదం ముద్రవేయగా.. బైడెన్ యంత్రాంగం దీనిని ధ్రువీకరించింది.


By May 15, 2021 at 06:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/military-attacks-from-both-israel-and-palestine-large-scale-fatalities-reported/articleshow/82649430.cms

No comments