Breaking News

VMS Eve రోదసీ విమాన ప్రయోగం సక్సెస్.. స్పేస్ టూరిజానికి లైన్ క్లియర్!


అంతరిక్ష టూరిజం కోసం అమెరికాకు చెందిన సంస్థ చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతమయ్యింది. రాకెట్‌ తరహా విమానాన్ని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ శనివారం విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ఇద్దరు పైలట్లు అంతరిక్షానికి చేరుకున్నారు. ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ’ అనే ఈ .. పర్యాటకులను భూ వాతావరణపు అంచులకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. తాజా ప్రయోగంలో దీనిని ‘వీఎంఎస్‌ ఈవ్‌’ అనే వాహకనౌకకు అనుసంధానం చేసి న్యూ మెక్సికో నుంచి నింగిలోకి పంపారు. బయలుదేరిన కొద్దిసేపటికి.. 44,0000 అడుగుల ఎత్తుకు చేరిన తర్వాత వాహకనౌక నుంచి పైలట్లు సి.జె.స్టుర్కోవ్‌, డేవ్‌ మెక్‌కేలతో కూడిన విడిపోయింది. ఆ తర్వాత పైలట్లు యూనిటీలోని రాకెట్‌ ఇంజిన్ స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత నిలిపివేశారు. అయినా ఆ విమాన ప్రయాణం కొనసాగించి 89.2 మైళ్ల ఎత్తులో అంతరిక్షానికి చేరుకుంది. ధ్వని కన్నా మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించింది. గంటన్నర తర్వాత తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించిన విమానం.. గ్లైడర్‌లా విహరిస్తూ భూమిపై సురక్షితంగా దిగింది. ఈ యాత్రలో అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’కు చెందిన కొన్ని పరిశోధక సాధనాలనూ రోదసిలోకి పంపినట్టు వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ తెలిపారు. తాజా ప్రయోగం విజయవంతంగా సాగిందని, దీనికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషిస్తామని పేర్కొన్నారు. మరికొన్ని నెలలపాటు వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం వచ్చే ఏడాది నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని ఆ సంస్థ భావిస్తోంది. పరీక్షల్లో భాగంగా సంస్థ అధినేత బ్రాన్సన్‌ కూడా ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోకి వెళ్లి వస్తారు. ఇంతకుముందు రెండుసార్లు వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ ఈ స్పేస్‌ప్లేన్‌ను పరీక్షించింది. మొదటిది న్యూ మెక్సికో నుంచి, రెండోది కాలిఫోర్నియా మోజావా ఏడారి నుంచి ప్రయోగించింది. రెండున్నరేళ్లుగా ముమ్ముర ప్రయోగాలు నిర్వహించి విజయవంతంగా అంతరిక్షంలోకి విమానాన్ని పంపింది. ఇది పూర్తిస్థాయిలో సిద్ధమైతే రోదసిలోకి వెళ్లేందుకు దాదాపు 600 మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నారు. వీరిలో అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఒక్కో ప్రయాణికుడు 2- 2.5లక్షల డాలర్లు చెల్లించాల్సి రావొచ్చు. యూనిటీలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు పర్యాటకులు ప్రయాణించేలా రూపొందించారు.


By May 24, 2021 at 06:57AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/virgin-galactic-completes-first-spaceflight-vss-unity-in-step-toward-finishing-development/articleshow/82897562.cms

No comments