Breaking News

Vaccine కోసం పంజాబ్ రిక్వెస్ట్.. అలా కుదరదన్న మోడెర్నా!


వ్యాక్సిన్ల ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా రాష్ట్రాలే కొనుగోలు చేసుకునే వెసులుబాటు కేంద్రం గత నెలలో కల్పించింది. దీంతో పలు రాష్ట్రాలు టీకాల కోసం గ్లోబల్ టెండర్లకు ఆహ్వనిస్తున్నాయి. అయితే, విదేశీ సంస్థల నుంచి కొనుగోలుకు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు గండిపడింది. నేరుగా కేంద్రంతోనే ఒప్పందం చేసుకుంటామని ఖరాఖండిగా చెప్పేస్తున్నాయి. అమెరికా దిగ్గజ సంస్థ మోడెర్నాను పంజాబ్ ప్రభుత్వం సంప్రదించగా.. తమ సంస్థ విధానాల ప్రకారం కేంద్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుంటామని తెగేసి చెప్పింది. అంతేకాదు, ఈ ఏడాది చివరి వరకూ తమ వద్ద అదనపు నిల్వలు ఉండవని మోడెర్నా స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఫైజర్ విషయానికి వస్తే కంపెనీకి మినహాయింపు ఇవ్వాలనుకుంటున్న నష్టపరిహార నిబంధన అంశం చుట్టూ జరుగుతున్న చర్చలు కొలిక్కివచ్చాయని తెలిపాయి. టీకాలను భారత్‌కు పంపిణీ చేయడానికి సరఫరా సమస్యను క్రమబద్ధీకరించాల్సి ఉందన్నాయి. ప్రస్తుతం ఈ టీకాను అమెరికా, ఐరోపా సమాఖ్య, యూకే, కెనడా, సింగపూర్, దక్షిణ కొరియాతో సహా దాదాపు 50 దేశాలలో వినియోగానికి ఆమోదం లభించింది. ఇంతకు ముందు ఫైజర్ కూడా కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టీకరించింది. తమ టీకాను భారత్‌లో సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతున్న ఫైజర్.. కొన్ని మినహాయింపులు, రక్షణ చర్యలు కోరుతోంది. పలు దేశాల్లో ఇదే నమూనాను అనుసరిస్తున్నట్టు తెలిపింది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల కోసం భారీ డిమాండ్ ఉన్నందున చాలా కంపెనీలు సామర్థ్య పరిమితులను ఎదుర్కొంటున్నాయి. వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి పలు దేశాలు డోస్‌ల మధ్య వ్యవధిని పెంచుతున్నాయి. శాస్త్రీయంగా రెండు డోస్‌ల మధ్య విరామం కనీసం 28 రోజులు ఉండాలి. భారత్‌లో టీకాల కొరత ఎక్కువగా ఉండటంతో కోవిషీల్డ్ టీకా డోస్‌ల వ్యవధిని రెండుసార్లు సవరించారు. తొలుత 4 వారాలు ఉండగా.. దానిని మార్చిలో 6-8 వారాలకు పెంచారు. తర్వాత మే 13న 12-16 వారాలకు పొడిగించారు.


By May 24, 2021 at 01:18PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/moderna-declined-request-for-sending-vaccines-directly-to-states/articleshow/82903923.cms

No comments