Breaking News

Happy Birthday Ajith: తెలుగు సినిమాతో కెరీర్‌ స్టార్ట్.. తలనెరిసినా తగ్గని క్రేజ్.. సౌతిండియాకే ట్రెండ్ సెట్టర్‌


స్టార్ హీరో అంటే ఇలాగే ఉండాలి.. అనే కొలమానాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. స్మార్ట్ లుక్స్, స్టైలిష్ డ్రెస్సింగ్ ఇలా చెప్పుకుంటూపోతే బొలెడన్ని క్వాలిటీస్ ఉంటేనే అతన్ని హీరోగా గుర్తిస్తారు. కానీ, అలాంటి అడ్డుగోడలు అన్ని బద్దలుకొట్టారు . తల, గడ్డెం నెరిసినా.. కనీసం రంగు కూడా వేసుకోకుండా యాక్టింగ్ చేస్తూ.. సౌతిండాలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. సినిమా రంగంలోనే కాదు.. రేసింగ్‌లోనూ తన ప్రతిభ చూపిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. నేడు(మే 1వ తేదీ) ‘తలా’ 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు కొన్ని తెలుసుకుందాం. అజిత్ 1971, మే 1వ తేదీన సికింద్రాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కేరళకి చెందిన వ్యక్తి, తల్లి సింధిది కోల్‌కతా. పదవ తరగతిలో చదువు మానేసిన ఆయన.. ఆ తర్వాత ఓ మిత్రుడి ద్వారా కొంతకాలం రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో మెకానిక్‌గా పని చేశారు. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే ఆయన మోడలింగ్, చేయడం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ ఆయనను గుర్తించి.. సినిమా రంగంవైపు అడుగులు వేయించారు. ఇక దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికమండేషన్‌తో ఆయన ‘ఎన్‌ వీడు ఎన్ కనవర్’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులో ‘ప్రేమ పుసక్తం’ అనే సినిమా ద్వారా ఆయన హీరోగా మారారు. కానీ, ఆ సినిమా దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్ మృతితో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత 1993లో ‘అమరావతి’ అనే సినిమా ద్వారా అజిత్ తొలిసారిగా వెండితెరపై కనిపించారు. కానీ, ఆయనకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, పట్టువదలని అజిత్ కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించారు. 1995లో విడుదలైన ‘ఆసాయ్’ అనే సినిమా ద్వారా తొలి సక్సెస్‌ని అందుకున్నారు అజిత్. అప్పటి నుంచి అజిత్ వెనక్కి తిరిగి చేసుకోలేదు. తన రెండో హిట్ సినిమా ‘కాదల్ కొట్టాయ్’తో అజిత్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 1997లో ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాలీ’ అనే సినిమాతో ఆయన తమిళంతో పాటు తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాతో ఆయన స్టార్ హీరో స్టేటస్‌ని సంపాదించుకున్నారు. ఇక 1999లో అజిత్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా.. అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక ‘బిల్లా’ సినిమా ద్వారా సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు అజిత్. ఈ సినిమాలో ఆయన డ్యుయల్ రోల్‌లో నటించి అభిమానులతో పాటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన తన 50వ చిత్రం ‘మన్‌కథ (తెలుగులో గాంబ్లర్)’లో ఆయన తొలిసారిగా డిఫరెంట్‌లుక్‌లో కనిపించి అలరించారు. ఆ తర్వాత ‘ఆరంభం’, ‘వీరమ్’, ‘ఎన్నాయ్ అరిందాల్’, ‘వేదాలం’, ‘వివేగం’ ‘విశ్వాసం’ తదితర చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు అజిత్. దాదాపు 60 చిత్రాల్లో నటించిన అజిత్ తన సినిమా కెరీర్‌లో నాలుగు విజయ్ అవార్డులు, మూడు ఫిలిమ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకున్నారు. యాక్టింగ్‌తో పాటు రేసింగ్‌లో అజిత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో జరిగిన కారు రేసుల్లో పాల్గొన్న ఆయన.. అందులోనూ తన సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ వేదికగా ఫార్ములా కార్ రేసింగ్‌లో పాల్గొన్న అతి తక్కువ మంది భారతీయుల్లో ఆయన ఒకరు. 2000 సంవత్సరంలో ‘అమర్కళం’ సినిమాలో ఆయన హీరోయిన్‌గా నటించిన షామిలీని అజిత్ వివాహం చేసుకున్నారు. 2008లో వీరికి పాప జన్మించింది. ఇక హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘పింక్’ తమిళ రీమేక్‌ ‘నెర్కొండ పార్వాయ్’లో అజిత్ నటించారు. ప్రస్తుతం ఆయన హెచ్.వినోథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆయన తన కెరీర్‌లో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ.. ‘తెలుగు సమయం’ తరఫున అజిత్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నాము.


By May 01, 2021 at 09:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/thala-ajith-celebrates-his-50th-birthday-on-may-1st/articleshow/82338737.cms

No comments