Breaking News

పుల్వామాలో అమరుడైన జవాన్.. రెండేళ్లలో ఆర్మీలో చేరిన భార్య, సెల్యూట్


అది 2019 ఫిబ్రవరి 14. పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. 27 ఏళ్ల నికితా కౌల్‌కు ఆర్మీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ దాడిలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లలో ఆమె భర్త విభూతి శంకర్ కూడా ఒకరు. అప్పటికి ఆమెకు పెళ్లై 9 నెలలే. భర్త అంటే ప్రాణం. అందరూ ఆమెను చూసి జాలిపడ్డారు. భర్త మృతదేహాన్ని చూడగానే ఉబికి వచ్చిన కన్నీటిని ఆపుకొని సెల్యూట్ చేశారు. ‘నేను కూడా ఆర్మీలోకి వెళ్తా’ అని బిగ్గరగా చెప్పారు.. ఆ మాటలు విని దేశం ఆమెకు సెల్యూట్ చేసింది. ఇదిగో ఇప్పుడామె.. తాను చెప్పిన మాటను నిజం చేశారు. కఠిన శిక్షణను పూర్తి చేసుకొని భర్త మరణించిన రెండేళ్లలోనే ఆర్మీలో చేరారు. ధైర్యం, సాహసం గురించి మనం చాలాసార్లే వినుంటాం. కానీ, అసలైన ధీరత్వం ఇప్పుడు చూడండి.. భర్త చనిపోతే కుంగిపోకుండా ఆయన దారిలోనే నడవాలనుకోవడం ఒక సాహసమైతే, దేశ సేవ కోసం ముళ్ల దారిని మురిపెంగా స్వీకరించడం మరో సాహసం. ఇది కదా భారత వీర నారి తెగువంటే. ఇండియన్ ఆర్మీ పవరంటే. ఒక జవాన్.. తాను నేలకొరిగినా, ఎలా నిప్పు రగిలిస్తాడో, ఎందరిలో స్ఫూర్తి నింపుతాడో చూశారా? కట్టుకున్నవాడు దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయినా కుంగిపోకుండా భర్తను సగర్వంగా సాగనంపిన ధీర వనిత మన నికిత. తన్నుకొస్తున్న కన్నీటిని దిగమింగుకుని ‘ఐ లవ్యూ’ అంటూ ఒక ముద్దుతో నాడు ఆయణ్ని సాదరంగా సాగనంపారు. ఆ తర్వాత ఢిల్లీలో ఎంఎన్‌సీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణలో చేరారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ రాతపరీక్షనూ, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఇంటర్వ్యూనూ విజయవంతంగా పూర్తి చేశారు. తన భర్త శిక్షణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలోనే సీటు సాధించారు. తాజాగా శిక్షణ పూర్తి చేసుకొని ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషీ స్వయంగా ఆమె భుజాలపై ఆర్మీ స్టార్స్ పెట్టి సైన్యంలోకి తీసుకున్నారు. ‘మీరు చాలా గర్వకారణం’ అంటూ ప్రశంసించారు. ఇప్పుడు మీ లక్ష్యమేమిటి అని నిఖితను ఎవరైనా అడిగితే.. ‘విభూ గర్వించే ఆఫీసర్‌ అవ్వాలన్నది నా కల’ అంటారామె. అంటే.. తన భర్త భౌతికంగా లేకపోయినా తనతో పాటు ఉన్నాడని ఆమె విశ్వాసం. ఎంత నమ్మకం అంటే.. ఇంటర్వ్యూలో బోర్డ్‌ సభ్యులు ఆమెను పెళ్లై ఎంత కాలమైందని అడిగితే.. రెండేళ్లని చెప్పారట. దానికి వాళ్లు ‘అదేంటి? మేం 9 నెలలని విన్నాం’ అన్నారట. అప్పుడు నిఖిత బదులిస్తూ ‘విభూ నాకు భౌతికంగా దూరం కావొచ్చు. అంతమాత్రాన మా బంధం ముగిసినట్టు కాదు కదా!’ అన్నారట. ఆర్మీలో చేరిన సందర్భంగా తన భర్తను గుర్తుచేసుకుంటూ.. ‘నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. విభూ వదిలి వెళ్లిన మార్గాన్ని నేను కొనసాగిస్తున్నా. నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఐ లవ్‌ యూ విభూ.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.’ అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. నిఖితా మీరు మా గుండెల్ని ఉప్పొంగేలా చేశారు.. సెల్యూట్.. జై జవాన్.. జైహింద్.


By May 30, 2021 at 12:18PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pulwama-martyr-major-dhoundiyals-wife-nikita-kaul-joins-indian-army/articleshow/83082999.cms

No comments