Breaking News

భారత్- యూకే వేరియంట్స్‌తో Hybrid Strain.. గాలిలో మరింత వేగంగా వ్యాప్తి!


రోజుకో రూపం దాల్చుతున్న కరోనా వైరస్ మహమ్మారి.. శాస్త్రవేత్తలకు అంతుచిక్కడంలేదు. డిసెంబరు 2019లో తొలిసారి చైనాలో వెలుగుచూసిన కరోనా.. జన్యుమార్పిడులకు గురవుతూ కొత్తరూపం సంతరించుకుంటోంది. తాజాగా, గాలిలో వేగంగా వ్యాప్తిచెందే సరికొత్త వేరియంట్‌ను వియత్నాం గుర్తించింది. భారత్, యూకేలో తొలిసారి గుర్తించిన స్ట్రెయిన్లతో సంయుక్తంగా జన్యుమార్పిడికి గురయినట్టు వియత్నాం ఆరోగ్య అధికారులు ధ్రువీకరించారు. వియత్నాంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. పారిశ్రామిక జోన్‌లు, హోనోయ్, హోం చి మిన్హ్ వంటి పెద్ద నగరాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వియత్నాంలో ఇప్పటి వరకూ 6,800 కేసులు, 47 మరణాలు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ కేసులు ఏప్రిల్ నుంచి నమోదవుతున్నవే కావడం గమనార్హం. ‘‘యూకే, భారత్‌లో తొలిసారి గుర్తించిన స్ట్రెయిన్‌తో కలిసి ఏర్పడిన కొత్త హైబ్రిడ్ వేరియంట్‌ను గుర్తించాం’’ అని వియత్నాం ఆరోగ్య శాఖ మంత్రి గుయేన్ థాన్హా లాంగ్ తెలిపారు. కరోనాపై శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గాలిలో అత్యంత వేగంగా వ్యాప్తిచెందగలడం దీని లక్షణమని అన్నారు. ‘‘గొంతు స్రావంలో వైరస్ సాంద్రత వేగంగా పెరుగుతుంది.. చుట్టుపక్కల వాతావరణానికి చాలా వేగంగా వ్యాపిస్తుంది’’ అని అన్నారు. అయితే, హైబ్రిడ్ వేరియంట్ కేసులు సంఖ్యపై మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ప్రపంచం జన్యు పరిణామ మ్యాప్‌ను వియత్నాం త్వరలోనే ఆవిష్కరించనుందని ప్రకటించారు. తమ శాస్త్రవేత్తలు 32 నమూనాలకు జన్యు పరీక్షలు నిర్వహించగా.. నలుగురిలో మ్యుటెంట్ వైరస్ గుర్తించినట్టు వియత్నాం సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ ఎపిడిమియాలజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రి లాంగ్ ప్రకటనకు ముందు వియత్నాంలో ఏడు రకాల వేరియంట్‌లు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కట్టడికి గతంలో వియత్నాం చేపట్టిన చర్యలకు ప్రపంచవ్యాప్తం విస్తృత ప్రశంసలు దక్కాయి. తొలి దశలో కరోనాను సమర్ధంగా కట్టడిచేసినా.. ప్రస్తుతం మహమ్మారి ఉద్ధృతంగా ఉంది. తాజాగా కేసులు పెరగడం ప్రజలు, ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో కఠిన ఆంక్షలకు అధికారులు ఉపక్రమించారు. దేశంలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మొత్తం 9.7 మిలియన్లున్న వియత్నాంలో ఇప్పటి వరకూ 10 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన ఈ ఏడాది చివరి నాటికి హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ల కోసం వ్యాపారవేత్తలు, ప్రజలు విరాళాలు ఇవ్వాలని అధికార యంత్రాంగం కోరుతోంది. ఈ విషయంలో రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థల సహకారాన్ని కోరుతున్నట్టు వియత్నాం అధికార మీడియా తెలిపింది. దాదాపు 20 లక్షలు ఆస్ట్రాజెన్‌కా వ్యాక్సిన్ డోస్‌లు కలిగి ఉండగా.. 30 మిలియన్లకుపైగా ఫైజర్ డోస్‌లను కొనుగోలుచేస్తోంది.


By May 30, 2021 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/vietnam-discoverd-hybrid-of-variants-found-in-india-and-uk/articleshow/83082380.cms

No comments