Breaking News

కోవిషీల్డ్ డోస్‌ల వ్యవధి పెంపు.. వైట్‌హౌస్ సలహదారు ఫౌచీ ఆసక్తికర వ్యాఖ్యలు


కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని ప్రస్తుతమున్న 6-8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచాలని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ) సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సులను అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, వైట్‌హౌస్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ సమర్ధించారు. ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డోస్‌ల మధ్య వ్యవధి సహేతుకమైన విధానమేనని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కోవిడ్ సంక్షోభానికి అడ్డుకట్టవేయాలంటే వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. ‘‘మీరు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, భారతదేశంలో వీలైనంత త్వరగా టీకాలు వేయడానికి మార్గాలను ప్రయత్నించాలి.. గుర్తించాలి, కాబట్టి ఇది ఒక సహేతుకమైన విధానం అని నేను నమ్ముతున్నాను.. రెండు డోస్‌ల మధ్య విరామం పొడిగించడం వల్ల టీకా సమర్థత కూడా ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఎక్కువ జాప్యం చేస్తున్నారనేది వాస్తవం.. కానీ, ఇది టీకా సమర్థతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదు. మనకు తగినంత టీకాలు అందుబాటులో లేనప్పుడు ఈ విధానం సూచించను’’ ఫౌచీ అన్నారు. రష్యా టీకా స్పుత్నిక్-వీ గురించి ప్రశ్నించగా.. ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు, దీని సమర్ధత 90 శాతం కంటే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది అని పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాటంలో సైన్యం పాత్ర కీలకమని వివరించారు. గతేడాది అమెరికాలో కరోనా విజృంభించడంతో రక్షణ శాఖ యుద్ధ నౌకలను కోవిడ్ ఆస్పత్రులుగా వినియోగించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రయివేట్ సెక్టార్ కంటే సైన్యం వేగంగా చర్యలు తీసుకోగలదని అన్నారు. ఉదాహరణకు పడకల కొరత వల్ల బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదని, ఇటువంటిప్పుడు యుద్ధ సమయంలో వ్యవహరించినట్టే సైన్యం క్షేతస్థాయి ఆస్పత్రులను ఏర్పాటుచేసి సేవలు అందించాలని సూచించారు. భారత్‌లో ప్రస్తుతం వైరస్ చాలా చాలా చాలా తీవ్రంగా ఉందని, ఆ దేశ ప్రయాణాలపై విధించిన నిషేధం ప్రస్తుతం ఎత్తివేయడం చాలా కష్టమని అన్నారు. తదుపరి పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా పలు దేశాలు వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ లేదా హెల్త్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అమలు చేస్తున్నాయి. అయితే, తాము మాత్రం దీనిని అమలు చేయడం లేదని డాక్టర్ ఫౌచీ వెల్లడించారు.


By May 14, 2021 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-chief-medical-adviser-dr-anthony-fauci-on-covishield-dose-gap/articleshow/82625597.cms

No comments